Hardik Pandya Trade: హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో కొత్త ట్విస్ట్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన!
Hardik Pandya Trade: MI denied reports of trade talks with CSK involving Hardik Pandya. ఐపీఎల్ 2027 ముందు హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది.
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో కొత్త ట్విస్ట్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన!
Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 ముందు భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) చెక్ పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే )కు పాండ్యను ఎంఐ ట్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే తరఫున స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేతో పాటు దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ముంబైకి ఇచ్చే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎంఐ అధికార ప్రతినిధి ఖండించారు. సీఎస్‌కేతోనే కాకుండా మరే ఫ్రాంచైజీతోనూ ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం జట్టు ఐపీఎల్ 2026 సీజన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రతినిధి తెలిపారు. 'ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌పై రివ్యూ నిర్వహిస్తున్నాం. జట్టు ప్రదర్శనలోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాము. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోము. ట్రేడ్‌లపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటి వరకు ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఎవరితోనూ మేము సంప్రదింపులు చేయలేదు. ప్రస్తుతం పలు అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోలేం' అని వెల్లడించారు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా అందించిన విజయాలను ముంబైలో పునరావృతం చేయడంలో అతడు విఫలమయ్యాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో ముంబై ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోవడంతో జట్టు యాజమాన్యం మార్పులపై ఆలోచిస్తోందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో కొందరు సీనియర్ ఆటగాళ్లతో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఇటీవల ముంబై ఇండియన్స్ టాలెంట్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని హార్దిక్ పాండ్య విడిచిపెట్టడం కూడా అతని భవిష్యత్తుపై చర్చలకు కారణమైంది. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ గతంలో కీలక ఆటగాళ్లను ఎక్కువకాలం జట్టులోనే కొనసాగించిన చరిత్రను కలిగి ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్య కూడా జట్టు ప్రధాన కోర్ గ్రూప్‌లో భాగమేనని భావిస్తున్నారు. ఐపీఎల్ 2027 మెగా వేలం ఈ డిసెంబర్లో అవకాశం ఉంది. 2027లో హార్దిక్ పాండ్యకు మరో అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ భావించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ముంబై దిగ్గజ ఆటగాడు రోహిత్ కూడా 2027 సీజన్ అనంతరం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.