Raksha Bandhan 2026: రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం.. సోదరులకు రాఖీ ఎప్పుడు కట్టాలి?
రాఖీ పౌర్ణమిరోజునే చంద్రగ్రహణం రావడంతో రాఖీ ఎప్పుడు కట్టాలి, సూతక్ కాలం పాటించాలా లేదా అనే సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం.
Raksha Bandhan 2026: సనాతన ధర్మంలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పర్వదినం 'రాఖీ పౌర్ణమి'. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సోదరీలు తమ సోదరుల ముఖంలో ఆనందం చూడాలని, వారు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. సోదరులు సైతం తమ శ్రేయస్సు కోరే తోడబుట్టిన వారికి జీవితాంతం అండగా ఉంటామని అభయమిస్తారు. అయితే, 2026 ఆగస్టు 28వ తేదీన రాఖీ పండుగ రోజే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో భక్తుల్లో, సామాన్య ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. గ్రహణ సమయంలో రాఖీ కట్టవచ్చా, సూతక్ కాలం నియమాలు పాటించాలా లేదా అనే విషయంలో స్పష్టత అవసరం.
చంద్రగ్రహణం... స్థానిక ప్రభావం
ఆగస్టు 28న ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం మొత్తం దాదాపు 5 గంటల 36 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఉదయం 9:43 గంటల ప్రాంతంలో గ్రహణం తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఉదయం 11:21 గంటలకు పూర్తవుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధాన విషయమేమిటంటే .. ఈ గ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ఎక్కడా కనిపించదు.
సూతక్ కాలం వర్తిస్తుందా?
శాస్త్రాల ప్రకారం, గ్రహణం ఏ ప్రాంతంలోనైతే కంటికి కనిపిస్తుందో అక్కడ మాత్రమే 'సూతక్ కాలం' లేదా నియమావళి చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుండి సూతక్ కాలం ప్రారంభమై, వాతావరణంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయని భావిస్తారు. కానీ, మన దేశంలో గ్రహణ దృశ్యమానత లేదు కాబట్టి ఎలాంటి సూతక్ నియమాలు వర్తించవు. కాబట్టి దేవాలయాలు మూసివేయడం గానీ, నిత్య పూజలు ఆపడం గానీ చేయాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
రాఖీ కట్టడానికి శ్రేష్ఠమైన ముహూర్తం
ఈ ఏడాది సూర్యోదయానికి ముందే 'భద్ర కాలం' ముగిసిపోవడం మరో శుభ పరిణామం. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఇక, ఆగస్టు 28న ఉదయం 05:57 గంటల నుండి ఉదయం 09:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలోనే రాఖీ కట్టేయాలని పండితులు చెబుతున్నారు. ఈ రక్షాబంధన్ వేళ ఎటువంటి భయాందోళనలు లేదా సంకోచాలు లేకుండా, ఉదయమే దివ్యమైన ముహూర్తంలో తోడబుట్టిన వారికి రాఖీలు కట్టి లక్ష్మీనారాయణుల దివ్యానుగ్రహాన్ని పొందవచ్చు.