Puri Jagannath: పూరీ గురించి ఎవరికీ తెలియని రహస్యం...ఈ తాబేలు, కాకినే సాక్ష్యం
పూరీ ఆలయం ఎలా నిర్మితమైంది...సత్య యుగంలోని ఆలయం కలియుగంలో ఎలా బయటపడిందో తెలుసుకుందాం. కాకి, తాబేలు, కల్పవృక్షం ఎలా సాక్ష్యం చెప్పాయో తెలుసుకుందాం.
Puri Jagannath: ఒక తాబేలు, ఒక కాకి... ఇవి రెండు ఒక ఆలయ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు వింటున్నది నిజమే. ఇది సాక్షాత్తూ సప్త మోక్షపురులలో ఒకటైన పుణ్యక్షేత్రం, ఒరిస్సాలోని పూరీ జగన్నాథుని కథ. లోకకళ్యాణ కారకుడైన శ్రీ మహావిష్ణువు, జగన్నాథుడిగా కొలువైన ఈ ఆలయంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఇక్కడి స్వామివారి రూపం కూడా ఇతర ఆలయాల కన్నా భిన్నంగా, పూర్తిగా లేని హస్తాలు, కనురెప్పలు లేని విశాలమైన నేత్రాలతో భక్తులకు దర్శనమిస్తాడు. అయితే, ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు, సత్యయుగానికి చెందిన ఈ ఆలయంలో ఎలా వెలిశాడు? ఆ ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కల నుంచి మొదలైన అన్వేషణ
సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు తన రాజ్యాన్ని అత్యంత ధర్మబద్ధంగా పాలిస్తుండేవాడు. దైవభక్తిలోనూ ఆయనకు సాటిలేరు. భూలోకంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి, భగవంతుని స్వయంగా ప్రతిష్టించాలని ఆయన కోరిక. ఇదే ధ్యాసతో ఉన్న రాజుకు ఒకరోజు కలలో స్వామివారు కనిపించి, తాను నీలాంచల్ పర్వత గుహల్లో "నీలమాధవుడి"గా ఉన్నానని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే రాజు తన నమ్మకస్తులను నలుదిక్కులకు పంపాడు. వారిలో విద్యాపతి ఒకరు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కీకారణ్యంలో ప్రయాణించిన విద్యాపతి, దాహంతో అపస్మారక స్థితికి చేరుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కోయ జాతి యువతి లలిత అతనికి నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడుతుంది. ఆమె తండ్రి, కోయగూడెం నాయకుడు విశ్వవసు. లలిత, విద్యాపతిని ప్రేమిస్తుంది, వారి వివాహం కూడా జరుగుతుంది. అయితే, విశ్వవసు ప్రతిరోజూ రాత్రి పూట ఎక్కడికో వెళ్లి వచ్చేటప్పుడు సుగంధ పరిమళాలు రావడం విద్యాపతి గమనిస్తాడు. తన తండ్రి నీలమాధవుడిని పూజించడానికి వెళ్తాడని లలిత ద్వారా తెలుసుకున్న విద్యాపతి, కళ్లకు గంతలు కట్టుకుని వెళ్లాలనే షరతుతో విశ్వవసు వెంట గుహకు చేరుకుంటాడు. దారి తెలుసుకోవడానికి విద్యాపతి ఆవాలను కింద వేసుకుంటూ వెళ్తాడు, అవి వర్షాకాలంలో మొలకెత్తి గుహకు దారి చూపుతాయి. గుహలో సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిని దర్శించి పులకించిపోతాడు విద్యాపతి.
అంతుచిక్కని దారువు... ఆకాశవాణి పలుకులు
విద్యాపతి ద్వారా సమాచారం అందుకున్న ఇంద్రద్యుమ్నుడు, నీలమాధవుడి కోసం అరణ్యానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే స్వామివారు అక్కడి నుంచి అదృశ్యమవుతారు. రాజు విశ్వవసును బంధించి హింసించగా, ఒకరోజు స్వామి కలలో కనిపించి తాను దారువు రూపంలో సముద్రంలో కొట్టుకొస్తున్నానని, దాన్ని విగ్రహంగా మలచాలని సూచిస్తాడు. రాజు ఆ దారువును కోటకు తరలించేందుకు ఏనుగులు, గుర్రాలను ఉపయోగించినా అది ఇసుమంతైనా కదలదు. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, విశ్వవసు క్షమాపణలు కోరితేనే అది కదులుతుందని చెబుతుంది. రాజు వెంటనే తన తప్పు తెలుసుకుని విశ్వవసును రప్పించగా, అతడు చేయి వేయగానే ఆ దారువు సునాయాసంగా కదులుతుంది.
గదిలో బంధీగా శిల్పి... అసంపూర్తిగా విగ్రహాలు
ఆ చెక్కను విగ్రహాలుగా మలిచేందుకు అనంత మమారాణా అనే శిల్పి వస్తాడు. 21 రోజుల పాటు తనను ఒక గదిలో బంధించి, ఏ శబ్దమూ రాకుండా ఉండాలని షరతు విధిస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లోపలి నుంచి శబ్దాలు ఆగిపోవడంతో, రాజు ఆందోళనతో గది తలుపులు తెరుస్తాడు. లోపల శిల్పి కనిపించడు, విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. అప్పుడు నారద మహర్షి వచ్చి, ఇది దైవ సంకల్పమని, ఆ మూర్తులకే ప్రాణప్రతిష్ట చేయాలని చెబుతాడు.
తవ్వకాల్లో బయటపడ్డ ఆలయం... మూగ జీవాల సాక్ష్యం
ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకం వెళ్లి తిరిగి వచ్చేసరికి యుగాలు మారిపోతాయి. ఆ స్థానంలో గాల మాధవుడు అనే రాజు పాలనలో ఉంటాడు. ఒకసారి తవ్వకాల్లో ఈ అద్భుతమైన ఆలయం బయటపడుతుంది. అది తాను నిర్మించిందేనని ఇంద్రద్యుమ్నుడు చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ సమయంలో, చక్రతీర్థంలోని ఒక తాబేలు, బుషిండీ అనే కాకి, కల్పవృక్షం... ఇవి మూడు ఇంద్రద్యుమ్నుడికే ఆ ఆలయం చెందుతుందని సాక్ష్యం చెబుతాయి. చివరగా బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేస్తాడు. స్వామివారి ఆదేశం ప్రకారం, ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను రథాలపై గుండిచా దేవి ఆలయానికి తీసుకెళ్లి వారం రోజుల పాటు ఉంచుతారు. ఈ ఆచారం వందల ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కోయ జాతికి చెందిన విశ్వవసు, విద్యాపతి వంశస్తులే నేటికీ స్వామివారి సేవలో తరించడం ఈ ఆలయ విశిష్టత.