Gold ATM : ఇదో వింత ఏటీఎం.. బంగారం వేస్తే చాలు.. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి
Gold ATM : చైనాలో నూతన గోల్డ్ ఏటీఎం ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. పాత బంగారం వేస్తే 30 నిమిషాల్లో నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. కింగ్‌హుడ్ గ్రూప్ వినూత్న టెక్నాలజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
China Gold ATM
Gold ATM : టెక్నాలజీలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే చైనా, ఇప్పుడు సామాన్యుల కోసం మరో అద్భుతమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. సాధారణంగా మనకు డబ్బులు ఇచ్చే ఏటీఎంలు తెలుసు, కానీ ఇప్పుడు చైనాలో గోల్డ్ ఏటీఎం హల్ చల్ చేస్తోంది. మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని ఈ మిషన్‌లో వేస్తే చాలు.. అది క్షణాల్లో కరిగించి, స్వచ్ఛతను పరీక్షించి, ఆ పైసలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో వేసేస్తుంది. చైనాలో ఇప్పుడు ఈ గోల్డ్ ఏటీఎంలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మన దగ్గర ఉన్న పాత నగలు లేదా బంగారు బిస్కెట్లను ఈ మిషన్ లోని స్లాట్‌లో వేయాలి. వెంటనే ఆ మిషన్ లోపల బంగారం కరగడం మొదలవుతుంది. ఆ తర్వాత హై-టెక్ సెన్సార్ల సహాయంతో దాని స్వచ్ఛత, బరువును అత్యంత పారదర్శకంగా లెక్కిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కస్టమర్ కళ్ల ముందే డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. లెక్క తేలాక, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఎంత నగదు వస్తుందో చూపిస్తుంది. మీరు ఓకే అంటే చాలు, కేవలం 30 నిమిషాల్లో ఆ సొమ్ము మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది.
కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి
ఈ మిషన్‌ను వాడుకోవాలంటే కొన్ని కనీస షరతులు ఉన్నాయి. మీరు మిషన్ లో వేసే బంగారం కనీసం 3 గ్రాముల బరువు ఉండాలి. అలాగే దాని స్వచ్ఛత కనీసం 50 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. సాధారణంగా మనం నగల షాపులకు వెళ్తే వాళ్ళు తరుగు అని, మజూరీ అని కోతలు కోస్తారు, కానీ ఈ మిషన్‌లో అలాంటి మోసాలకు తావుండదు. అందుకే చైనా ప్రజలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా కాగితాల అవసరం లేకపోవడం మరో విశేషం.
ఎగబడుతున్న జనం
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. ఈ ఏటీఎంలకు డిమాండ్ ఎంతలా ఉందంటే.. చాలా చోట్ల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు మూడు నెలల వరకు అపాయింట్‌మెంట్‌లు బుక్ అయిపోయాయి అంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
This ATM in Shanghai, China, melts your gold at 1200°C and transfers money straight to your accountpic.twitter.com/vFHGA6llAq
— Massimo (@Rainmaker1973) April 11, 2026
డెమోలో తేలిన లెక్క
ఇటీవల నిర్వహించిన ఒక డెమోలో ఒక కస్టమర్ 40 గ్రాముల బంగారు గొలుసును ఈ ఏటీఎంలో వేయగా, గ్రాముకు సుమారు 785 యువాన్ల ధర లభించింది. అంటే మొత్తం 36,000 యువాన్లు వచ్చాయి. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 4.2 లక్షల రూపాయలు. ఏ షాపు చుట్టూ తిరగకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం అరగంటలో ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో జనం ఫిదా అవుతున్నారు. చైనాలోని ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని కింగ్‌హుడ్ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.