Siddipet: ములుగు ఉద్యాన వర్సిటీలో ఉద్యోగుల మహాధర్నా!
Siddipet: ములుగు కొండ లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో పీఆర్సీ అమలు, డీఏల విడుదలతో పాటు వివిధ డిమాండ్లపై ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో మహాధర్నా నిర్వహించారు.
Siddipet: ములుగు ఉద్యాన వర్సిటీలో ఉద్యోగుల మహాధర్నా!
Siddipet: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిపాలన కార్యాలయంలోని బోధన బోధనేతర ఉద్యోగులు గురువారం మహాధర్నా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బోధన బోధనేతర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
పరిపాలన కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రధాన గేటు వరకు వెళ్లి అక్కడ మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు ఇచ్చారు.
ప్రధానంగా PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, CPSను రద్దు చేయాలని, యూనివర్సిటీ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు కోరారు. ఉద్యోగుల ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ నిరసనలో పరిపాలన కార్యాలయానికి చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు, మహాధర్నాలు నిర్వహించారు.
పి జి ఐ హెచ్ ఎస్ నుండి ప్రొఫెసర్ సుచిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్లు సతీష్ చంద్రశేఖర్ లు కూడా హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు పోతురాజు యాదయ్య, జనరల్ సెక్రటరీ ఎ. చెంచు రామయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది.