Rajahmundry: రాజమండ్రి 69వ వార్డులో టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభం!

రాజమండ్రి: రాజమహేంద్రవరం నగరంలోని 69వ వార్డు (పాత 44వ వార్డు)లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. 69వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 69వ వార్డులో మరుకుర్తి రవి యాదవ్‌కు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచార వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు రవి యాదవ్ తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండున్నరేళ్లలో నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. 43, 44వ డివిజన్ల పరిధిలో సుమారు రూ.17.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ మహిళా సాధికారతతో పాటు నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, నగరపాలక సంస్థలోనూ కూటమి పాలకవర్గం ఏర్పడితే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

69వ వార్డులో మరుకుర్తి రవి యాదవ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి కమలం గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థి మరుకుర్తి రవి యాదవ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు ప్రజలను కోరారు. కార్యాలయ ప్రారంభోత్సవంతో 69వ వార్డులో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమం కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఉత్సాహభరితంగా సాగింది.

Tags: