Chintoor: ప్రమాద మృతదేహాన్ని స్వయంగా మోసి రోడ్డు పక్కకు తరలించిన ఎస్ఐ!

చింతూరు: రోడ్డు మధ్యలో మృతదేహం పడి ఉంది. చుట్టూ వందల మంది గుమిగూడి చూస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు.. వీడియోలు చేస్తున్నారు.. కానీ ఒక్కరూ దగ్గరకు వెళ్లి ఆ మృతదేహాన్ని పక్కకు జరపలేదు. అది చూసి అందరూ మౌనంగా ఉండిపోయిన సమయంలో.. ఒక యూనిఫాం ముందుకొచ్చింది. అదే చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్. చింతూరులోని అటవీశాఖ గెస్ట్ హౌస్ ముందు లారీ ఢీకొని రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.అక్కడి పరిస్థితి చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎవరి సాయం కోసం ఎదురుచూడలేదు. తన చేతులతోనే రాజ్ కుమార్ మృతదేహాన్ని మోసుకుని రోడ్డు పక్కకు తరలించారు. రక్తం, ధూళి అంటుకుంటుందని కూడా పట్టించుకోలేదు.

ఒక పోలీస్ అధికారి ఇలా మృతదేహాన్ని స్వయంగా మోయడం చూసి అక్కడున్న జనం నివ్వెరపోయారు. "ఇది కదా నిజమైన మానవత్వం.. ఇది కదా యూనిఫాం వెనుక ఉన్న మనసు" అంటూ అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు.ఉద్యోగం అంటే కేవలం కేసులు, చలాన్లు కాదు.. మనిషిగా స్పందించడమే అని చింతూరు ఎస్ఐ మరోసారి నిరూపించారు.

Tags: