Amalapuram: రూ.327 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు వేగవంతం
Amalapuram: అమలాపురం నియోజకవర్గంలో రూ.327 కోట్లతో చేపట్టిన విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Amalapuram: రూ.327 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు వేగవంతం
అమలాపురం: జిల్లాలో ఇంటింటా పీఎం సూర్య ఘర్‌పై విస్తృత ప్రచారం చేయాలి.పీజీఆర్ఎస్,1912 ఫిర్యాదులను గ్రామాల వారీగా విశ్లేషించి,త్వర్తిగతిన పరిష్కార మార్గాలు చూపాలి అని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు.జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.327 కోట్లతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఆర్.మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్,అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు తో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో మూడవ విద్యుత్ కమిటీ సమావేశంలో విద్యుత్ శాఖ పనితీరు,మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వేసవి నాటికి ప్రజలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.జిల్లాలో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేయాలని, మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.
అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని స్పష్టం చేశారు.ఈ సమీక్షలో విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ బి. రాజేశ్వరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడవ జిల్లా విద్యుత్ కమిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు,స్థానిక శాసనసభ్యులు వివరాలు సమగ్రంగా తెలియజేశారు.
జిల్లాలోని 19 మండలాలు,362 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.327 కోట్ల ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు.గత పదేళ్లుగా ఉన్న సింగిల్‌ఫేజ్ నెట్‌వర్క్, పాత కేబుల్స్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో వోల్టేజ్ 113 వోల్ట్స్ వరకు పడిపోతున్న సమస్యను గుర్తించామని తెలిపారు. సింగిల్‌ఫేజ్ లైన్లను త్రీ-ఫేజ్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నామని, వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా లైన్ల సామర్థ్యాన్ని 360 యాంప్స్ నుంచి 650 యాంప్స్‌కు పెంచుతున్నట్లు చెప్పారు.
పాత వైర్ల స్థానంలో పాంథర్ కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.గత ఏడాది పాడైన 2,000కు పైగా పాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది కొరతకు త్వరలో పరిష్కారం చూపాలని అధికారం కోరారు.
క్షేత్రస్థాయిలో ఏఈలు, సెక్షన్ అధికారులు,లైన్‌మెన్ల కొరత కారణంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.దసరా నాటికి బదిలీలు,నియామకాల ద్వారా సిబ్బంది కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారిని తెలిపారు.ప్రజల పట్ల విద్యుత్ సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విద్యుత్ సమస్యలపై వచ్చే అర్జీలపై విశ్లేషణ చేయాలని కోరారు.ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై పీజీఆర్ఎస్, 1912 టోల్‌ఫ్రీ నంబర్లకు వస్తున్న ఫిర్యాదులను గ్రామాలు, మండలాల వారీగా వర్గీకరించి విశ్లేషించాలని అమలాపురం ఎంపీ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా లోవోల్టేజ్,విద్యుత్ సరఫరా అంతరాయాలపై పునరావృతమవుతున్న ఫిర్యాదులను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.పనులను ఒక పద్ధతి ప్రకారం చేపట్టాలని, సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన తర్వాత ట్రాన్స్‌మిషన్ లైన్ల మార్పు వంటి పనులను సమన్వయంతో నిర్వహించాలని ఎంపీ సూచించారు.
కొన్ని ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు ఛార్జ్ చేసినప్పటికీ లోవోల్టేజ్ సమస్యలుకొనసాగుతున్నాయ ని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పీఎం సూర్య ఘర్‌కు విస్తృత ప్రచారం చేయాలని ఎంపీ కోరారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎంపీ సూచించారు.
3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.78,000 వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉందని తెలిపారు.జిల్లాలో ఇప్పటివరకు 7,924 మంది దరఖాస్తు చేసుకోగా, 5,735 ఇళ్లలో సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయిందని, వీటి ద్వారా సుమారు 17.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. నీడలేని పైకప్పులు ఉన్న ఇళ్ల యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ పథకంపై ప్రజల్లో ఇంకా తగినంత అవగాహన లేదని ఎంపీ పేర్కొంటూ, గ్రామాల్లో సర్పంచులు, విద్యుత్ వినియోగదారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సహకారంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తక్కువ విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులను గుర్తించి పథకం ప్రయోజనాలను వివరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అమలాపురం స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ అఖండ గోదావరి మహా పుష్కరాలు ఘాట్ల నిర్వహణ,అభివృద్ధి పనులు నియోజకవర్గంలో వేగవంతం చేయాలని, మరిన్ని ఘాట్లను గుర్తించి, ప్రభుత్వ స్థాయిలో ఘాట్ల నిర్వహణ తెలియజేయాలని కోరారు.
లంక గ్రామాలలో లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నందువల్ల వాటి పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో కొత్తపేట అమలాపురం విద్యుత్ శాఖ ఇంజనీర్లు కె రాంబాబు, డి రాజాబాబు, డిప్యూటీ ఇంజనీర్లు ఎం చంద్రశేఖర్ కుమార్ డి చిట్టి రాజు,ఎస్ కే నజీర్ కుమార్, బీవీ కృష్ణరాజా , డి శ్రీనివాసరావు సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.