Yerragondapalem: ఎర్రగొండపాలెంలో స్నేక్ క్యాచర్ లేక ఇబ్బందులు
Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఆసిఫ్‌నగర్‌లో నీటి డ్రమ్ములో పడిన పాము అటవీ సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పించుకుంది.
Yerragondapalem: ఎర్రగొండపాలెంలో స్నేక్ క్యాచర్ లేక ఇబ్బందులు
Yerragondapalem: మార్కాపురం జిల్లా.. ఎర్రగొండపాలెంమండల కేంద్రంలోని ఆసిఫ్‌నగర్‌లో ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన పాము స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇంటి ప్రాంగణంలో కనిపించిన పాము అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో నీటి డ్రమ్ములో పడిపోయింది. అప్రమత్తమైన ఇంటి యజమానులు ధైర్యం చేసి డ్రమ్ముకు మూతపెట్టి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, పాములను పట్టుకోవడంలో అనుభవం లేకపోవడంతో డ్రమ్ములోని నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాము డ్రమ్ము నుంచి బయటకు జారి సమీప ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ ఇంటి సభ్యులు, ముఖ్యంగా చిన్నారులు సంచరించే ప్రాంతంలో పాము తప్పించుకుపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్ ఉంటే పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం స్నేక్ క్యాచర్ లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉండటంతో తరచూ పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే ప్రత్యేక స్నేక్ క్యాచర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
గతంలో ఎర్రగొండపాలెం మండల పరిధిలో పనిచేసిన స్నేక్ క్యాచర్‌ను నిధుల కొరత కారణంగా అటవీ శాఖ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అప్పటి నుంచి పాములు కనిపించిన సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్నేక్ క్యాచర్‌ను నియమించి ప్రజలకు భరోసా కల్పించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.