Nellore: రామాయపట్నం పోర్టు నిర్మాణం 80.55 శాతం పనులు పూర్తి
Nellore: రామాయపట్నం పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయని, 2026 డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ వెల్లడి.
Nellore: రామాయపట్నం పోర్టు నిర్మాణం 80.55 శాతం పనులు పూర్తి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 80.55 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ తెలిపారు. ఈ విషయాన్ని తాను రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, నౌకాశ్రయాలు మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో... వెల్లడించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా టెట్టు రైల్వే స్టేషన్ వరకు 7.40 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టగా, దీనికి రైల్వే శాఖ నుంచి ఆమోదం లభించిందని, ఇప్పటివరకు 30 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ పనులను కూడా డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్నదని వెల్లడించారు.
అలాగే జాతీయ రహదారి-16తో రామాయపట్నం పోర్టును అనుసంధానించే 5.5 కిలోమీటర్ల రోడ్డు పనులు 95 శాతం పూర్తయ్యాయని, ఈ కనెక్టివిటీ పనులను 2026 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్‌వాటర్ పనులు 97.98 శాతం, బెర్త్ నిర్మాణ పనులు 95.35 శాతం, డ్రెడ్జింగ్ పనులు 68.73 శాతం పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు ఎంపీ తెలిపారు.
సాగర్‌మాల పథకం కింద దేశవ్యాప్తంగా పోర్టు కనెక్టివిటీ అభివృద్ధికి రూ.1,614.51 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, అందులో కేంద్ర ప్రభుత్వం రూ.406.54 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేసి, ఇప్పటివరకు రూ.378.69 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం సమాధానంలో పేర్కొన్నదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం పోర్టు కనెక్టివిటీకి సంబంధించిన రెండు ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
అదేవిధంగా దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో పర్యావరణహిత "గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (GTTP)" ను దశలవారీగా అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. తొలి దశ 2027 డిసెంబర్ నాటికి, చివరి దశ 2040 ఆగస్టు 15 నాటికి దేశంలోని అన్ని పోర్టుల్లో 100 శాతం గ్రీన్ టగ్‌లను ప్రవేశపెట్టే లక్ష్యంతో కార్యక్రమం అమలవుతోందని వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ....
రామాయపట్నం పోర్టు పూర్తి కావడం వల్ల నెల్లూరు జిల్లా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, వాణిజ్య, ఎగుమతుల రంగాలకు కొత్త ఊతం లభిస్తుందని, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. పోర్టు నిర్మాణంతో పాటు రైలు, రోడ్డు అనుసంధాన పనులు కూడా నిర్ణీత గడువులో పూర్తి కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.