Nellore: నెల్లూరులో బహిరంగ చర్చకు దమ్ముంటే రావాలి కోటంరెడ్డి
Nellore: డీఎస్సీ, అభివృద్ధిపై చర్చకు నెల్లూరు వేదికగా సిద్ధం కావాలని వైకాపా నేతలకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సవాల్.
Nellore: నెల్లూరులో బహిరంగ చర్చకు దమ్ముంటే రావాలి కోటంరెడ్డి
నెల్లూరు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, రౌడీయిజం, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడి, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రగతి పథంలో నడుస్తుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
నారా లోకేష్ చొరవతో డీఎస్సీ ద్వారా 16,000 పైచిలుకు టీచర్ పోస్టులను ప్రకటించి భర్తీ చేస్తుంటే కర్నూలులో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తమకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మనుషులు కూడా దొరకరనే భయంతో వైకాపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు, పస లేని ఆరోపణలతో డీఎస్సీపై రెండుసార్లు కోర్టుకు వెళ్లి భంగపడ్డారని విమర్శించారు. గతంలో వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ బొమ్మల క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, ఐదేళ్ల పాలనలో ఒక్క ఫ్యాక్టరీ లేదా రూపాయి పెట్టుబడి కూడా తేలేకపోయిందని దుయ్యబట్టారు... నాడు పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించి, హత్యలను ప్రోత్సహించి, తమపై 64 అక్రమ కేసులు పెట్టిన చరిత్ర వైకాపాదని మండిపడ్డారు.
ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు అరెస్టులు, ధర్నాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా నాయకులు 30 ఏళ్ల లోపు యువతతో జెన్-జి పేరుతో చేస్తున్న నిరాహార దీక్షల్లో రాజానాల, నాగభూషణం, మొక్కాంబాల, ధూళిపాళ్ల వంటి పాత ముఖాలు తప్ప ఒక్క నిరుద్యోగి గానీ, టీచర్ గానీ కనపడలేదని ఎద్దేవా చేశారు. చివరికి ఆందోళనల్లో వెంకటేశ్వరస్వామి గోవింద నామాలను కూడా వక్రీకరించి పాటలు పాడారని, గతంలో స్వామితో పెట్టుకున్న నాయకులు ఎలా నాశనమయ్యారో తెలుసుకోవాలని హెచ్చరించారు.
మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, నెల్లూరు కిసాన్ సెజ్‌లో సుమారు 6,000 కోట్ల అంచనా వ్యయంతో టాటా పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగబోతోందని, మరో 8,000 ఉద్యోగాల భర్తీకి లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు.. చివరగా, వైకాపా మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు తమ హయాంలో జిల్లాకు ఒక్క ఫ్యాక్టరీ అయినా తెచ్చారా అని నిలదీశారు. లోకేష్ గారి భాషపై విమర్శలు చేసే కాకాణి ఇంగ్లీషులోనో, తమిళంలోనో మాట్లాడగలరా అని ప్రశ్నించారు.
గతంలో గురువులను మద్యం షాపుల ముందు క్యూ లైన్లలో నిలబెట్టి అవమానించిన వైకాపా ప్రభుత్వం ఒకటైతే, ఈ రోజు ఉపాధ్యాయులను గురు పూజోత్సవం ద్వారా గౌరవిస్తున్నది కూటమి ప్రభుత్వమని కొనియాడారు. డీఎస్సీ, అభివృద్ధి, పరిశ్రమలపై ధైర్యముంటే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి లోకేష్ తో చర్చకు రావాలని, లేదా స్థానిక వైకాపా నాయకులు నెల్లూరు వేదికగా తమతో బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు.
లేనిపక్షంలో హిందూ సమాజానికి, ఉపాధ్యాయులకు, లోకేష్ కి వైకాపా నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.