Vijay TVK: మిరాకిల్ః తమిళనాడులో విజయ్‌ ప్రభంజనం...

తమిళనాడు రాజకీయాల్లో ఒక అద్భుతం జరిగింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

Update: 2026-05-04 05:14 GMT

Vijay TVK: తమిళనాడు రాజకీయాల్లో ఒక అద్భుతం జరిగింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించి, అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలకు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన విజయ్‌ టీవీకే... అధికారం చేపట్టేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే వందకు పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న విజయ్‌ టీవీకే మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంటుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరం.

సంఖ్యల లెక్కల్లో విజయ్ జోరు

ప్రస్తుత ట్రెండ్స్‌ ప్రకారం 234 స్థానాలకుగాను టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. టీవీకే ఇప్పటికే 100 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక అధికారంలో ఉన్న డీఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితం అయింది. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అన్నా డీఎంకే గతంలో సాధించిన స్థానాల్లోనే బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తమిళనాడులో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 118. అయితే, ట్రెండ్స్‌ని బట్టి చూస్తుంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విజయ్‌ తమిళనాడులో కింగ్‌ మేకర్‌గా మారతాడని అనుకున్నా... ఫలితాలను చూస్తుంటే కింగ్‌ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. విజయ్‌ తిరుచ్చి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఈరెండు చోట్ల విజయ్‌ లీడింగ్‌లో ఉండటం విశేషం.

ద్రావిడ కోటలు ఎందుకు కుప్పకూలాయి?

తమిళ రాజకీయాలంటే కేవలం డీఎంకే లేదా ఏఐఏడీఎంకే మాత్రమే అన్న నానుడిని విజయ్ తుడిచిపెట్టేశారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అధికార డీఎంకేపై ఉన్న తీవ్ర వ్యతిరేకత . రెండోది... యువతలో విజయ్‌కు ఉన్న అపారమైన క్రేజ్. సినిమా గ్లామర్‌ను కేవలం స్టార్‌డమ్‌కే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో యువతను ఆకట్టుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. విజన్ ఉన్న నాయకుడిగా, మార్పు కోరుకునే యువతకు ఆయన ఒక ఆశాదీపంగా కనిపించారు. అటు అన్నాడీఎంకే ఓటు బ్యాంకును కూడా విజయ్ భారీగా చీల్చినట్లు స్పష్టమవుతోంది.

ప్రభుత్వ ఏర్పాటులో 'దళపతి'దే కీలక పాత్ర

ప్రస్తుతానికి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 సీట్లు దక్కలేదు. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే, ఇప్పుడు ఎవరితో జతకడుతుంది? లేదా స్వతంత్రంగా ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనప్పటికీ తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమౌతుంది.  

Tags:    

Similar News