Cancer Drug : క్యాన్సర్‌కు కొత్త మందు వచ్చింది.. కానీ రేటు చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం
Cancer Drug : అమెరికన్ సంస్థ ఎలీ లిలీ క్యాన్సర్ చికిత్స కోసం టాన్‌స్ట్రైవ్ అనే కొత్త ఔషధాన్ని భారత్‌లో లాంచ్ చేసింది.
Cancer Drug
Cancer Drug : ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రపంచాన్ని భయపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. మనదేశంలో కూడా రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా ఒక సరికొత్త వైద్య విప్లవం భారత్‌లో అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కంపెనీ తాము తయారు చేసిన అత్యాధునిక యాంటీ-క్యాన్సర్ డ్రగ్ టాన్స్ట్రైవ్ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ విభాగంలో ఇదొక మైలురాయిగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఈ సరికొత్త ఔషధం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నప్పటికీ, దీని ధర మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. భారత మార్కెట్లో ఈ టాన్‌స్ట్రైవ్ మెడిసిన్‌కు చెందిన ఒక బాక్స్ ధరను కంపెనీ రూ.2.15 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఒక్క బాక్సులో కేవలం 14 రోజుల చికిత్సకు సరిపడా టాబ్లెట్లు మాత్రమే ఉంటాయి. అంటే నెలకు కేవలం ఈ మందుల కోసమే దాదాపు రూ.4.30 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మందు లాంచ్ అయిన నాటి నుంచి దీని పనితనంతో పాటు దీనికి అయ్యే భారీ ఖర్చుపై కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ మందు పనితీరు సాధారణ కీమోథెరపీ కంటే పూర్తిగా భిన్నంగా, సురక్షితంగా ఉంటుంది. సాధారణంగా కీమోథెరపీ చేసినప్పుడు శరీరంలోని మంచి కణాలు, చెడు కణాలు అన్నీ నశించిపోయి రోగి నీరసించిపోతాడు. కానీ ఈ టాన్‌స్ట్రైవ్ మందు అలా కాకుండా, శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగడానికి కారణమయ్యే RET అనే ప్రత్యేక జన్యు లోపాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ప్రతి క్యాన్సర్ ఒకేలా ఉండదు కాబట్టి, రోగి శరీరంలో RET జీన్ వేగంగా మారుతూ క్యాన్సర్ గడ్డలను పెద్దవి చేస్తున్నప్పుడు.. ఈ టాన్‌స్ట్రైవ్ ఔషధం ఆ తప్పుడు సంకేతాలను మధ్యలోనే బ్లాక్ చేసి, ట్యూమర్ల ఎదుగుదలను పూర్తిగా నియంత్రిస్తుంది. అంటే ఇది నేరుగా వ్యాధి మూలాలపైనే దెబ్బకొడుతుంది.
వైద్యుల సూచనల మేరకు రోగుల శరీర తత్వానికి తగినట్లుగా అందించేందుకు వీలుగా ఈ టాన్‌స్ట్రైవ్ మెడిసిన్ మొత్తం 4 రకాల డోసేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 40 mg, 80 mg, 120 mg, 160 mg టాబ్లెట్లు ఉన్నాయి. ఈ క్యాన్సర్ నివారణ మాత్రలను రోగులు రోజుకు రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) చొప్పున క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. ఎలీ లిలీ ఇండియా ప్రెసిడెంట్ విన్స్లో టక్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత వైద్య రంగంలో పాత పద్ధతులను పక్కనబెట్టి జీన్ బేస్డ్ (జన్యు ఆధారిత), టార్గెటెడ్ ట్రీట్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో టాన్‌స్ట్రైవ్ వంటి ఆధునిక మందులు భారతీయ రోగులకు సరికొత్త ఆశలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా క్యాన్సర్ నయం చేసే వైద్య విధానంలో టెక్నాలజీ వేగంగా మారుతోంది. గతంలో క్యాన్సర్ స్టేజ్ ఆధారంగా అందరు రోగులకు ఒకే రకమైన రేడియేషన్ లేదా కీమోథెరపీని అందించేవారు. కానీ ఇప్పుడు వైద్యులు రోగికి చికిత్స ప్రారంభించే ముందే, వారి శరీరంలో ఏ జన్యువు దెబ్బతినడం వల్ల క్యాన్సర్ వచ్చింది అనేదానిపై జీన్ మ్యుటేషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగానే పర్ఫెక్ట్ మెడిసిన్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే RET జీన్ లోపాలు ఉన్నవారికి టాన్‌స్ట్రైవ్ ఒక సంజీవనిలా మారనుంది. భవిష్యత్తులో ఇటువంటి అధునాతన మందుల ధరలు మరింత తగ్గితే దేశంలోని కోట్లాది మంది పేద రోగులకు ప్రాణభిక్ష లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.