TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు.. టీవీకే విజయ్‌ పై ఫోర్జరీ కేసు

TVK Vijay : టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఫోర్జరీ ఆరోపణలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గందరగోళం కొనసాగుతోంది.

Update: 2026-05-09 02:31 GMT

TVK Vijay 

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అసలైన సస్పెన్స్ మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని మెప్పించిన దళపతి విజయ్, ఇప్పుడు పొలిటికల్ క్లైమాక్స్‌లో చిక్కుకున్నారు. టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఫోర్జరీ ఆరోపణలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గందరగోళం కొనసాగుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK), మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మే 9 ఉదయం 11 గంటలకే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావించారు. కానీ మ్యాజిక్ ఫిగర్ విషయంలో లెక్కలు కాస్త తారుమారయ్యాయి. ప్రస్తుతం మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 116 వద్ద ఆగిపోవడంతో, గవర్నర్‌ను కలిసే విషయంలో డైలమా నెలకొంది. ఈలోపే ఏఎంఎంకే (AMMK) అధినేత టీటీవీ దినకరన్ రంగంలోకి దిగి పెను సంచలనం సృష్టించారు.

సంతకం ఫోర్జరీ ఆరోపణలు

విజయ్ గవర్నర్‌కు సమర్పించిన 116 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలో తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని దినకరన్ ఆరోపించారు. కామరాజ్ ప్రస్తుతం పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్‌లో ఉన్నారని, ఆయన సంతకాన్ని విజయ్ వర్గం దొంగిలించి నకిలీ మద్దతు లేఖ సృష్టించిందని దినకరన్ గిండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని విజయ్ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి.

వీడియోతో అదిరిపోయే కౌంటర్

దినకరన్ చేసిన ఫోర్జరీ ఆరోపణలను విజయ్ పార్టీ టీవీకే (TVK) ఏమాత్రం తగ్గకుండా తిప్పికొట్టింది. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖపై సంతకం చేస్తూ, ఆనందంగా కనిపిస్తున్నారు. తాను దినకరన్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. దీంతో దినకరన్ ఆరోపణలు అబద్ధమని టీవీకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కామరాజ్ మాత్రం ఇప్పుడు మళ్ళీ మాట మార్చి, ఆ సంతకం నాది కాదు అని చెబుతుండటం ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పెద్ద ట్విస్ట్‌గా మారింది.

గవర్నర్ నిర్ణయంపైనే అందరి చూపు

ఇటు విజయ్ వైపు, అటు అన్నాడీఎంకే పళనిస్వామి వైపు రాజకీయాలు తిరుగుతున్నాయి. దినకరన్ అర్ధరాత్రి గవర్నర్‌ను కలిసి, విజయ్ బలనిరూపణ చేయలేకపోతే అన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు విజయ్ మిత్రపక్షాలు మంత్రి పదవుల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ నేడు గవర్నర్‌ను కలిసి మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంతకాల యుద్ధం మరియు వీడియోల గొడవలో గవర్నర్ ఎవరికి అవకాశం ఇస్తారోనని తమిళనాడు ప్రజలు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News