RBI: నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం.. దేశంలో మారనున్న నోట్లు.?
RBI: దేశంలో నోట్ల రద్దు జరిగి దాదాపు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పునకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
RBI: నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం.. దేశంలో మారనున్న నోట్లు.?
RBI: దేశంలో నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరిగి దాదాపు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పునకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెరుగుతున్న నగదు అవసరాలు, నోట్ల ముద్రణ వ్యయం అధికమవుతున్న నేపథ్యంలో కొత్త నోట్లను తీసుకొచ్చే అవకాశాలపై ఆర్బీఐ పరిశీలిస్తోంది.
ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు అంటే ఏమిటి?
పాలిమర్ బ్యాంక్ నోట్లు ప్రత్యేక రకం ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. వీటిని సాధారణంగా "ప్లాస్టిక్ మనీ" అని కూడా పిలుస్తారు. ఈ నోట్ల తయారీలో ప్రధానంగా బయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొప్లైన్ (BOPP) అనే సింథటిక్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. ఈ నోట్లు చాలా పలుచగా, వంగే లక్షణంతో పాటు బలంగా ఉంటాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే త్వరగా చినిగిపోవు. అలాగే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.
RBI ఎందుకు ఈ నిర్ణయంపై ఆలోచిస్తోంది?
RBI గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాగితపు నోట్ల ముద్రణకు రూ.6,372 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ వ్యయం గణనీయంగా పెరిగింది. దేశంలో నగదు వినియోగం పెరుగుతుండటంతో కొత్త నోట్ల ముద్రణ అవసరం కూడా పెరుగుతోంది. దీంతో ప్రతి ఏడాది భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. ఈ వ్యయాన్ని తగ్గించడానికి పాలిమర్ నోట్లు మంచి ప్రత్యామ్నాయంగా RBI భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలిమర్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ప్లాస్టిక్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అవి తేమ, మురికి, చినిగిపోవడం వంటి సమస్యలను సులభంగా తట్టుకుంటాయి. అలాగే వీటిలో అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించవచ్చు. దీంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ATM యంత్రాల్లోనే ఈ నోట్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. కొత్త మౌలిక సదుపాయాల అవసరం తక్కువగా ఉంటుంది.
కాగితపు నోట్లతో సమస్యలు ఏమిటి?
ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు కొంతకాలం తర్వాత దెబ్బతింటాయి. ముఖ్యంగా రూ.100, రూ.500 నోట్లు ఎక్కువగా వినియోగంలో ఉండటంతో త్వరగా పాడవుతున్నాయి. ప్రతి సంవత్సరం కోట్లాది దెబ్బతిన్న నోట్లను RBI ఉపసంహరించుకోవాల్సి వస్తోంది. వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించాల్సి రావడం వల్ల అదనపు వ్యయం పెరుగుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు పాలిమర్ నోట్లు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే అనేక దేశాల్లో అమలు
భారత్‌లో ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టాలనే ఆలోచన కొత్తది కాదు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పాలిమర్ నోట్లు తీసుకురావాలని నిర్ణయించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రణాళిక అమలు కాలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని 60కి పైగా దేశాలు పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టింది. తర్వాత కెనడా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, రొమేనియా వంటి దేశాలు కూడా ఈ విధానాన్ని అమలు చేశాయి.