NEET Paper Leak : నీట్ మాఫియా గుట్టురట్టు.. సీబీఐ వేటలో ఇప్పుడు కోటీశ్వరులైన పేరెంట్స్
NEET Paper Leak : నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. లక్షలు ఖర్చు చేసి పేపర్ కొన్న తల్లిదండ్రులే లక్ష్యంగా మహారాష్ట్రలో దాడులు నిర్వహిస్తోంది.
NEET Paper Leak
NEET Paper Leak : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG 2026) పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ తన విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు కేవలం పేపర్ లీక్ చేసిన ముఠాలు, మధ్యవర్తులు, మాస్టర్‌మైండ్‌ల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. అక్రమ మార్గాల్లో లక్షల రూపాయలు వెచ్చించి తమ పిల్లల కోసం లీక్ అయిన ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన తల్లిదండ్రుల పై సీబీఐ గురిపెట్టింది. శని, ఆదివారాల్లో మహారాష్ట్రలోని నాందేడ్, లాతూర్ ప్రాంతాల్లో సీబీఐ బృందాలు మెరుపు దాడులు నిర్వహించి పలువురు పేరెంట్స్‌ను విచారించాయి.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక వ్యాపారి ఇంట్లో సీబీఐ ఎనిమిది మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. తన కుమార్తెకు మెడికల్ సీటు ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో, సదరు వ్యాపారి మధ్యవర్తులకు రూ.10 లక్షలు చెల్లించి పేపర్ కొనుగోలు చేసినట్లు పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి. ఆ విద్యార్థిని తల్లిదండ్రులను సీబీఐ సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. వారి సెల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకుంది. పూణేలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఆ అమ్మాయి 15 రోజుల పాటు ఎందుకు స్టే చేసింది? అక్కడ ఎవరిని కలిశారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఏఐబీ అనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పేరు కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది. విచిత్రం ఏమిటంటే, నీట్ ఫలితాలు రాకముందే ఈ కోచింగ్ సెంటర్ రాబోయే ఫలితాలు అనే ట్యాగ్‌లైన్‌తో టాపర్ల ఫోటోలను పోస్టర్లుగా వేసింది. అందులో ఇప్పుడు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థిని ఫోటో కూడా ఉండటం గమనార్హం. అంటే పరీక్షకు ముందే ఆ విద్యార్థిని ఎన్ని మార్కులు సాధించబోతుందో కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఎలా తెలిసిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే నిర్వాహకులు మాత్రం తమకేమీ తెలియదని బుకాయిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ధనిక తల్లిదండ్రులు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించి పేపర్ కొన్నారని, ఆ ఖర్చును తగ్గించుకోవడానికి మళ్ళీ ఆ పేపర్‌ను మరికొంతమందికి అమ్ముకున్నారని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంటే లీకేజీ అనేది ఒక చైన్ లాగా పుణే, లాతూర్, నాందేడ్ జిల్లాల్లో విస్తరించింది. కేవలం మధ్యవర్తులే కాదు, అక్రమంగా పేపర్ కొన్న తల్లిదండ్రులు కూడా నేరస్తులేనని, వారిపై కఠిన చర్యలు తప్పవని సీబీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం లక్షలాది మంది కష్టపడి చదివే విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకతపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, ఈ అక్రమ నెట్‌వర్క్‌లో ఉన్న రాజకీయ సంబంధాలను కూడా సీబీఐ వెలికితీస్తోందని సమాచారం. మనీ ట్రయల్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు.