One Vote Margin: ఒక్క ఓటుతో ఓటమి..చేజారిన సీఎం పదవి
One Vote Margin: నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే? అని నిర్లక్ష్యం చేసే వారికి భారత ఎన్నికల చరిత్రలో నమోదైన కొన్ని అరుదైన విజయాలు కళ్ళు తెరిపిస్తాయి.
One Vote Margin: ఒక్క ఓటుతో ఓటమి..చేజారిన సీఎం పదవి
Indian Elections: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అంటుంటారు. అది ఎంతటి శక్తివంతమైనదో నిరూపించే కొన్ని సందర్భాలు భారత ఎన్నికల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఒక్క ఓటు తక్కువైనా సీఎం పీఠం చేజారిపోవచ్చు.. ఒక్క ఓటు కలిసొచ్చినా చరిత్ర సృష్టించవచ్చు. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో శీనివాస సేతుపతి సాధించిన విజయం ఈ అంశాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
ఒకే ఒక్క ఓటుతో టీవీకే జైత్రయాత్ర
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నో సంచలనాలకు వేదికయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించడమే కాకుండా, తిరుపత్తూరు నియోజకవర్గంలో ఒక అద్భుత ఘట్టం నమోదైంది. ఇక్కడ టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థిపై కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేశారు. చివరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టేలా సాగిన ఈ కౌంటింగ్‌లో, ఆ ఒక్క ఓటే సేతుపతిని అసెంబ్లీకి పంపింది.
ఒక్క ఓటు మిగిల్చిన విషాదం
ఒక్క ఓటు విలువకు సంబంధించి దేశంలో ఇప్పటికీ చర్చించుకునే ప్రధాన ఘట్టం 2008 రాజస్థాన్ ఎన్నికలు. నాథద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ దిగ్గజం సీపీ జోషి, బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి ఎంతటి విషాదకరమంటే.. ఆనాడు సీపీ జోషి గెలిచి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఒక్క ఓటు తక్కువ కావడంతో అశోక్ గెహ్లాట్ ఆ అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు రీకౌంటింగ్ చేపట్టినప్పుడు ఫలితం టై అయింది. సుప్రీంకోర్టు లాటరీ తీయాలని ఆదేశించినా, ఈలోపు తదుపరి ఎన్నికలు రావడంతో ఆ కేసు సద్దుమణిగింది.
మోటార్ సైకిల్ తెచ్చిన మెజారిటీ
లోక్‌సభ ఎన్నికల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఎన్నికల గుర్తుల్లో సైకిల్‌కు బదులుగా మోటార్ సైకిల్ ఉండటంతో ఓట్లు చీలి, ఆయన అతి తక్కువ మెజారిటీతో నెగ్గారు. ఇప్పటికీ దేశంలో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన ఎంపీ స్థానాల్లో ఇది టాప్‌లో ఉంది.
అరుదైన విజయాలు
2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్‌లో రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల మెజారిటీతో గెలిచి ఉత్కంఠ రేపారు. 2004 కర్ణాటక ఎన్నికల్లో సంతెమరహళ్లి నియోజకవర్గంలో ధ్రువనారాయణ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే? అని నిర్లక్ష్యం చేసే వారికి శీనివాస సేతుపతి, సీపీ జోషిల ఫలితాలే నిదర్శనం.