Marriage Fraud: వీడు మామూలు ఆటగాడు కాదు.. 25 పెళ్లిళ్లు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు
Marriage Fraud: యూపీలోని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ అల్లుడు ప్రఖర్ త్రివేది 25 మంది మహిళలను పెళ్లాడి మోసం చేసినట్లు బయటపడింది.
Gyan Tiwari
Marriage Fraud: ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా సేవతా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ కుటుంబంలో ఒక విస్తుపోయే ఘరానా మోసం బయటపడింది. సినిమాల మాదిరిగా ఒక మోసగాడు తన నిజ స్వరూపాన్ని దాచి ఎమ్మెల్యే కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు ఇప్పటివరకు ఏకంగా 25 మంది మహిళలను పెళ్లాడి భారీ మొత్తంలో డబ్బు కాజేసిన ఘరానా మోసగాడని తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ స్వయంగా తన కుమార్తెతో కలిసి ఒక వీడియో విడుదల చేసి ఈ సంచలన నిజాలను బయటపెట్టారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పి మోసం
ఎమ్మెల్యే కుమార్తె ప్రజ్ఞకు 2024లో ప్రఖర్ త్రివేది అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ప్రఖర్ త్రివేది ముంబైలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారినని, తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు. అంతేకాకుండా తనపై ఉన్న పాత క్రిమినల్ రికార్డులను, కేసులను పూర్తిగా దాచిపెట్టి వివాహం చేసుకున్నాడు. బాగా తెలిసిన వారి ద్వారా విచారించిన తర్వాతే వివాహానికి అంగీకరించామని, అయితే రెండున్నర ఏళ్ల తర్వాత అతని మోసపూరిత ప్రవర్తన, సోషల్ మీడియా ద్వారా అతని నిజస్వరూపం బయటపడిందని ఎమ్మెల్యే తెలిపారు.
నిందితుడు, అతని తండ్రి అరెస్ట్
ప్రఖర్ త్రివేది వేర్వేరు రాష్ట్రాల్లో తన గుర్తింపును మార్చుకుంటూ, ధనవంతులైన మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వలవేసేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, నగలు గుంజి పరారయ్యేవాడు. ఈ విషయాలు బయటకు రావడంతో ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ వెంటనే రేవోసా పోలీస్ స్టేషన్‌లో తన అల్లుడు ప్రఖర్ త్రివేది, వియ్యంకుడు అనుజ్ త్రివేదిలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీకొడుకులిద్దరినీ అరెస్ట్ చేశారు.
కుమార్తెను ఇంటికి తెచ్చుకున్న ఎమ్మెల్యే
అల్లుడి అసలు నైజం బయటపడటంతో ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తెను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చారు. ఆ కుటుంబంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని, సమాజంలో తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.