Suryapet: నిబంధనలు మీరితే ఈ-చలానా, జీపీఎస్ నిఘా రోడ్డు భద్రతపై కలెక్టర్

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్ లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రోడ్డు భద్రతపై సమీక్ష జరిపి, హైవే ఆక్రమణల తొలగింపునకు 45 రోజుల గడువు విధించారు.

Update: 2026-07-22 13:04 GMT

Suryapet: నిబంధనలు మీరితే ఈ-చలానా, జీపీఎస్ నిఘా రోడ్డు భద్రతపై కలెక్టర్

సూర్యాపేట: రోడ్డు ప్రమాదాల్లో పోయే ప్రతి ప్రాణం విలువైనదని, రోడ్డు భద్రత విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై వ్యక్తిగత శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజస్థాన్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన భారీ ప్రమాదాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఈ సమీక్ష చేపట్టారు. రవాణా, రెవెన్యూ, విద్య, వైద్యం, పోలీస్, ఆర్ అండ్ బి, పంచాయతీ, నేషనల్ హైవే అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. వచ్చే 45 రోజుల్లో ప్రమాదకర ప్రాంతాల పూర్తి జాబితా సిద్ధం చేయాలని, 4 నెలల్లో ఆయా ప్రాంతాల్లో హై-ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్లు, స్పీడ్ కెమెరాలు, రెట్రో-రిఫ్లెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు ఇవ్వాలన్నారు.

హైవేలపై అక్రమ పార్కింగ్‌కు చలానా, జాతీయ రహదారుల మెయిన్ రోడ్డు, పక్కన ఉన్న షోల్డర్లపై భారీ వాహనాల పార్కింగ్‌కు పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. వాహనాలను నిర్దేశిత లే-బై ప్రాంతాల్లో లేదా పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆపాలని ఆదేశించారు. ప్రతి 75 కిలోమీటర్లకు ఒక లే-బై సదుపాయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలానా, జీపీఎస్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆక్రమణల తొలగింపుకు 30 రోజుల గడువు, హైవేల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దాబాలు, హోటళ్లు, వాణిజ్య నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని, పాత అనుమతులను 30 రోజుల్లో సమీక్షించి అక్రమంగా ఉంటే రద్దు చేయాలన్నారు. డ్రోన్ సర్వేల ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగించాలని సూచించారు.

రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స, ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్యం అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 75 కిలోమీటర్లకు ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, ట్రామా కేర్ సెంటర్లను మ్యాపింగ్ చేసి బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

రోడ్డు భద్రతపై మాటలు కాదు చేతల్లో చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి 15 రోజులకోసారి ఫాలో-అప్ సమీక్ష ఉంటుందని, ఆర్టికల్ 21 ప్రకారం పౌరుల జీవించే హక్కును కాపాడటమే అధికారుల తొలి ప్రాధాన్యత కావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, డిపిఓ యాదగిరి, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, డీఈఓ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News