Athadu: మామా ఇదికదా సినిమా అంటే... 'అతడు'క్రేజ్‌కి ఇదే కారణం
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' సినిమా ఇప్పటికీ ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది? స్క్రీన్‌ప్లే, డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రిపీట్ వాల్యూ వెనుక ఉన్న అసలు కారణాలను ఇవే.
Athadu: మాస్ తెలుగు సినిమా చరిత్రను ‘అతడు’కు ముందు, ‘అతడు’కు తర్వాత అని ఖచ్చితంగా విభజించవచ్చు. భారీ ఫైట్లు, రొటీన్ మాస్ మసాలా ఫార్ములా సినిమాలతో ప్రేక్షకుడు విసిగిపోయిన తరుణంలో, 2005లో వచ్చిన ‘అతడు’ చిత్రం టాలీవుడ్ స్క్రీన్ ప్లే శైలిని పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ యాక్షన్ కథకు అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, పదునైన సంభాషణలు జోడించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన ఈ విజువల్ వండర్.. విడుదలై 21 ఏళ్లు కావస్తున్నా (2005-2026), ఇప్పటికీ బుల్లితెరపై, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తూనే ఉంది.
బాక్సాఫీస్ దాటిన రిపీట్ వాల్యూ ... తగ్గని క్రేజ్
థియేటర్లలో సాధించిన కలెక్షన్ల కంటే కూడా ఈ సినిమా సంపాదించుకున్న ‘రిపీట్ వాల్యూ’ చాలా పెద్దది. ఈ సినిమాలో నటుడు రాజీవ్ కనకాల పాత్ర నిడివి కేవలం 5 నిమిషాలు మాత్రమే. కానీ కథ మొత్తాన్ని నడిపే కీలకమైన ఎమోషన్ ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రేక్షకుడు ఆ పాత్రతో కనెక్ట్ అవ్వడమే సినిమా విజయానికి తొలి అడుగు. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లోనే కథానాయకుడి పాత్ర స్వభావం, అతని వృత్తి, సమస్య ఏంటనేది త్రివిక్రమ్ సూటిగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎస్టాబ్లిష్ చేశారు.
రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ‘కామన్ సెన్స్’ స్క్రీన్ ప్లే
అప్పటివరకు వచ్చిన బి. గోపాల్ లాంటి దర్శకుల భారీ యాక్షన్ చిత్రాల ఫార్ములాకు భిన్నంగా త్రివిక్రమ్ ఇక్కడ ‘కామన్ సెన్స్’ లాజిక్స్‌తో సీన్లు రాసుకున్నారు. ఉదాహరణకు, సిబిఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి "నందు" అని పిలవగానే, అవతలి వైపు ఉన్న మహేష్ బాబు సహజంగా "ఊ" అనడం.. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యాయి.
మితభాషి మహేష్ ... క్లాసిక్ కామెడీ టైమింగ్
మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత తక్కువ డైలాగులు ఉన్న సినిమా ఇదే కావచ్చు. కానీ ప్రతి మాట ఒక బుల్లెట్‌లా పేలింది. "నేను వస్తాను" అంటే "నేనే వస్తాను" అనే సింపుల్ వన్-లైనర్స్ సినిమా స్థాయిని పెంచాయి. దీనికి తోడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్స్ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. "ముసలోడే కానీ మహానుభావుడు" లాంటి ప్రాసలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి.
హింసను వృత్తిగా ఎంచుకున్న ఒక ప్రొఫెషనల్ కిల్లర్.. కుటుంబ విలువలు, స్నేహం మధ్యకు వస్తే ఎలా మారతాడనే పాయింట్‌ను ఎక్కడా బోర్ కొట్టకుండా, భారీ సెంటిమెంట్స్ రుద్దకుండా ఒక ‘ఫీల్ గుడ్’ క్లాసిక్‌గా మలిచారు. అందుకే ‘అతడు’ ఎప్పుడు చూసినా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి సినిమాలు బహుశా చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే అతడు సినిమాను అందరి సినిమాగా మార్చుకున్నారు. ఒక ప్రేక్షకుడిగా చెప్పాలంటే... ఈ సినిమాను థియేటర్లో దాదాపు 30 సార్లు కంటే ఎక్కువగా చూశాను. నేనే కాదు రోటీన్‌కు భిన్నమైన వాటిని ఆదరించే ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తుంటారు.