Lenin Collections: సినిమా కలెక్షన్లు కూడా కాపీయేనా?

Lenin Collections: యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాతో తొలి వీకెండ్ లోనే రూ. 61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించారు.

Update: 2026-07-15 05:50 GMT

Lenin Collections: సినిమా కలెక్షన్లు కూడా కాపీయేనా?

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు ఒక భారీ కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ థియేటర్లలో వసూళ్ల వేట కొనసాగిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా సరైన హిట్ లేదనే అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఈ సినిమాతో బ్రేక్ పడింది.

మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లు రాబట్టిన ‘లెనిన్’ చిత్రం తన మొదటి వీకెండ్‌ను ఘనంగా ముగించింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 16.7 కోట్ల భారీ గ్రాస్‌తో అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. అదే జోరుతో రెండు రోజుల్లోనే మొత్తం రూ. 37.2 కోట్లకు చేరుకుంది. సండే అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకుంటూ థియేటర్లలో ఈ సినిమా మరింతగా దుమ్మురేపింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 61.1 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించింది.

సినిమాకు అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయని మేకర్స్ సంబరపడుతున్న తరుణంలో, ఈ త్రీ-డేస్ కలెక్షన్ల పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా అసలు వసూళ్లను సుమారు 35 శాతం వరకు అదనంగా పెంచి చూపించారనే ఆరోపణలు ఒకవైపైతే.. కలెక్షన్ల అంకెలను కూడా పక్కాగా కాపీ కొట్టారంటూ నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం మొన్నటి సంక్రాంతికి విడుదలైన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరిల ‘అనగనగా ఒక రాజు’ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఆ చిత్రానికి కూడా మూడు రోజుల్లో సరిగ్గా రూ. 61.1 కోట్లు వచ్చినట్లు అప్పట్లో పోస్టర్ వదిలారు.

ఇప్పుడు అదే నిర్మాత నాగవంశీ నిర్మించిన అఖిల్ ‘లెనిన్’ చిత్రానికి కూడా పైసా తేడా లేకుండా సరిగ్గా మూడు రోజుల్లో అదే రూ. 61.1 కోట్లు అంటూ పోస్టర్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒకే నిర్మాత తన రెండు వేర్వేరు సినిమాలకు ఒకే రకమైన కలెక్షన్ నంబర్లతో పోస్టర్లు వేయడంపై కలెక్టన్ల గ్రాఫిక్స్ కాపీ-పేస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే ‘లెనిన్’ సినిమా క్లైమాక్స్ సీన్, సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన ‘కృష్ణబాబు’ చిత్రంలోని ఒక కీలక ఘట్టాన్ని పోలి ఉందంటూ నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దానికి తోడు కలెక్షన్ల పోస్టర్ కూడా కాపీ వివాదంలో చిక్కుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌కు సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లయింది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద అఖిల్ వసూళ్ల సునామీ సృష్టిస్తూ కెరీర్ బెస్ట్ హిట్ వైపు దూసుకెళ్తుంటే.. మరోవైపు ఈ క్రెడిబిలిటీ వివాదాలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News