Korean Kanakaraju Review: ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ..బొమ్మ దద్దరిల్లింది..!
Korean Kanakaraju Review: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ.
Korean Kanakaraju Review: ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ..బొమ్మ దద్దరిల్లింది..!
Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే వేసిన ప్రీమియర్ షోల నుంచే సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథ
పెనుగొండలో కోపిష్టి అయిన కనకరాజు (వరుణ్ తేజ్) ఒక చెక్క భజన బృందాన్ని నడుపుతుంటాడు. అతనికి స్నేహితుడైన కిష్టప్ప (సత్య) రన్ చేసే ఫోటో స్టూడియోనే ఈ బృందానికి అడ్డా. గ్రామంలో ఉన్న మునుస్వామి (చిన్నా) తో గొడవలు, మరోవైపు లోకల్ కియా కంపెనీలో పనిచేస్తూ కొరియా వెళ్లాలని కలలు కనే చైత్ర (రితికా నాయక్) తో కనకరాజు ప్రేమ కథ సాఫీగా సాగిపోతుంటాయి. అయితే, కొరియాలో చనిపోయిన ఒక బడా డాన్ అస్థికలు అనుకోకుండా పెనుగొండకు చేరుకుని, కనకరాజు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ కొరియన్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి వచ్చాక ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఆ డాన్ గతం ఏంటి? కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
ఒక రొటీన్ దెయ్యం కథకు 'కొరియన్ టచ్' ఇచ్చి అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడర్‌గా మలచడంలో మేర్లపాక గాంధీ మార్క్ మేకింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. లాజిక్స్‌ను పక్కన పెడితే, థియేటర్లలో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కొరియా బ్యాక్‌డ్రాప్‌తో ప్రారంభమయ్యే సినిమా, పెనుగొండకు కథ మారడంతో కాస్త సాదాసీదాగా సాగుతుంది. అయితే కొరియన్ దెయ్యం కనకరాజు ఒంట్లోకి వచ్చినప్పటి నుంచి కథ ఊపందుకుని, మంచి ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థం చాలా స్టైలిష్‌గా, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగుతుంది. ముఖ్యంగా ఈ భాగంలో కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ థియేటర్లను షేక్ చేస్తుంది. ఇటీవల వైరల్ అయిన అమెచ్యూరిష్ ట్రెండింగ్ డైలాగ్‌ను ఉపయోగించిన తీరు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ కాస్త ఏఐ ప్రాసెస్ వాడినట్లు తేలిపోయినా, సత్య కామెడీ ఆ లోపాన్ని కవర్ చేసేస్తుంది.
నటీనటుల పనితీరు
యాక్షన్, క్యారెక్టర్ మాడ్యులేషన్‌లో వరుణ్ తేజ్ తన మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి అసలైన హీరో సత్యనే. తన మార్క్ టైమింగ్‌తో సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తెరపై రితికా నాయక్ ఎంతో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. మురళీధర్ గౌడ, వీటీవీ గణేష్ తమ పరిధి మేర నవ్వించారు. సునీల్, అవసరాల శ్రీనివాస్‌లకు తక్కువ స్పేస్ లభించింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. తమన్ నేపథ్య సంగీతం అప్పటికే విన్నట్టు ఉన్నా, విజువల్స్‌కి తగ్గట్లుగా కుదిరింది. యాక్షన్ సీన్స్ , ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌లో ఉన్నాయి.
ఫైనల్‌గా
కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, ఎలాంటి లాజిక్స్ వెతకకుండా రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ‘కొరియన్ కనకరాజు’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఛాయిస్.
రేటింగ్: 3.25/5