Medak: వెల్దుర్తి రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర, నిరసన

Medak: మెదక్‌లో వెల్దుర్తి - పిల్లికొటల్ రోడ్డు నిర్మాణం కోరుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్ర నిర్వహించి, డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.

Update: 2026-08-31 13:58 GMT

Medak: వెల్దుర్తి రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర, నిరసన

మెదక్: వెల్దుర్తి - పిల్లికోటల్ రోడ్డుకు 13. 62 కోట్ల రూపాయలు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎందుకు రోడ్డు వేయడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే వి. సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం శివంపేట మండలం పోతులగూడెం నుంచి కలాన్‌ శెట్టిపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి కార్ల ర్యాలీగా మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

పాదయాత్రలో అడుగడుగునా గ్రామాలలో బ్రహ్మరథం పట్టారు ప్రజల సమస్యలను అడుగుతూ వారితో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగింది ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు తో పాదయాత్ర కొనసాగింది అనంతరం మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం తదితర అవసరాల కోసం ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటంతో వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని అన్నారు. డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్‌ మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం మారిన అనంతరం పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మంజూరైన నిధులను రద్దు చేసిందని ఆరోపించారు.

ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్‌ రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంజూరైన నిధులను పునరుద్ధరించి రహదారి నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని కోరారు. రహదారి నిర్మాణంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం కార్ల ర్యాలీగా మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి ప్రస్తుత పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మంజూరైన నిధులను పునరుద్ధరించి డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకొని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

రహదారి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్.బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News