Medak: కాలువల్లో తుమ్మ చెట్లు.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సెల్ఫీ అస్త్రం
Medak: నర్సాపూర్‌లో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనుల వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సెల్ఫీ దిగి సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Medak: కాలువల్లో తుమ్మ చెట్లు.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సెల్ఫీ అస్త్రం
మెదక్: ‘‘నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి.. ఇదేనా మీ పాలన?’’ అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. రెడ్డిపల్లి, మంతూరు గ్రామాల శివారులో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనులను పరిశీలించారు.
కాలువ పనులు ఆగిపోయిన ప్రదేశంలోనే హరీశ్ రావు సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఆ సెల్ఫీని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం కాలువ పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయని ఆరోపించారు.
‘ఈ సెల్ఫీనే మీ పాలనకు సాక్ష్యం’
‘‘ముఖ్యమంత్రి గారూ.. నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యానికి ఇలా పాడుబడ్డాయి. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనుల దగ్గర నేను దిగిన ఈ సెల్ఫీనే మీ చేతకాని పాలనకు సజీవ సాక్ష్యం’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
మెదక్ రైతులపై ఎందుకింత కక్ష?
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టుల పనులను నిలిపివేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేగంగా కొనసాగిన ప్రాజెక్టులు.. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదని విమర్శించారు.
వెంటనే నిధులు విడుదల చేయాలి
కాళేశ్వరం కాలువల పనులకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పనులను పునఃప్రారంభించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందేలా కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
‘‘ప్రాజెక్టులను గాలికి వదిలేసి రైతుల నోట్లో మట్టికొట్టొద్దు. వెంటనే నిధులు ఇచ్చి పనులు మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హరీశ్ సెల్ఫీతో రాజకీయ వేడి
ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనుల వద్ద హరీశ్ రావు సెల్ఫీ తీసుకుని దానిని సీఎం రేవంత్ రెడ్డికి పంపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాలువల్లో నీళ్లు పారాల్సిన చోట తుమ్మ చెట్లు పెరిగిన దృశ్యాలను చూపిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
కాళేశ్వరం కాలువల పనులకు నిధులు విడుదల చేసి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.