Mancherial: మంచిర్యాలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్!
Mancherial: మంచిర్యాల జిల్లాలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
Mancherial: మంచిర్యాలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్!
మంచిర్యాల జిల్లా: పోలీస్ శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో డీసీపీ ఎ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఆర్‌ఐ సంపత్‌లతో కలిసి శిక్షణకు సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఈవెంట్స్‌కు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర, జియోగ్రఫీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర అంశాల్లో నిపుణులైన ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 20 నుంచి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 8712538278, 9490906773 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. పోలీస్ ఉద్యోగాల సాధనకు ఈ ఉచిత శిక్షణ మంచి అవకాశమని, అర్హత కలిగిన అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.