Mancherial: సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ ఎ.భాస్కర్!
Mancherial: మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ను డీసీపీ ఎ.భాస్కర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి సరిహద్దు అక్రమ రవాణా, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
Mancherial: సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ ఎ.భాస్కర్!
మంచిర్యాల: రాష్ట్ర సరిహద్దు, మారుమూల ప్రాంతం కావడంతో నీల్వాయి పోలీస్ పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శనివారం మంచిర్యాల జోన్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ను డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
రౌడీషీటర్లు, ట్రబుల్ మంగర్స్, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని డీసీపీ సూచించారు. అవసరమైన సందర్భాల్లో వారి నివాసాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో క్రమశిక్షణ, పారదర్శకత, బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.