Chintalamanepally: ఐదు నెలలుగా పాఠశాల ముఖం చూడని ప్రధానోపాధ్యాయుడు.. గ్రామస్తుల ఆగ్రహం!

Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జూన్ నెలలో పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు హాజరు కావడం లేదని స్థానికులు విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానోపాధ్యాయుడు పాఠశాలను తిరిగి చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. జూన్ నెలలో పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి 50మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వం ముగ్గురు ఉపాధ్యాయులను నియమించింది కానీ అందులో ప్రధానోపాధ్యాయుడు ఇప్పటి వరకు పాఠశాలకు హాజరు కావడం లేదు.

దాదాపు 5 నెలలుగా ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ముఖం చూడకపోవడంతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వంటి విషయాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో మిగిలిన ఉపాధ్యాయులపై భారం పడుతోందని, దీని ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వెంటనే ప్రధానోపాధ్యాయుడిని పాఠశాలకు పంపించాలని, లేదా మరొకరిని నియమించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

Tags: