Mancherial: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు 10వ తరగతి వరకు ఉచిత విద్య!
Mancherial: సింగరేణి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల పిల్లలకు పదో తరగతి వరకు ఉచిత విద్య అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. 30 వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
Mancherial: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు 10వ తరగతి వరకు ఉచిత విద్య!
Mancherial: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయంతో సింగరేణి పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సంక్షేమంపై తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ ఉచిత విద్యా సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొమ్మిది పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న 400 మందికి పైగా కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు తక్షణమే ఈ నిర్ణయం వర్తించనుంది.
ఈ మేరకు సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల పిల్లలకు ఆయా ప్రాంతాల్లోని సింగరేణి పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించడంతో పాటు పదో తరగతి వరకు ఉచిత విద్య అందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించనుండటంతో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
ఈ సదుపాయం పొందాలనుకునే కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సంబంధిత సింగరేణి శాఖాధిపతుల ద్వారా ధ్రువీకరించి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు సింగరేణి విద్యాశాఖ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
కార్మిక కుటుంబాలకు ఆర్థిక ఊరట
ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో సింగరేణి పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచిత విద్య అందుబాటులోకి రావడం కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది.
ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా బోనస్ అందిస్తున్న సింగరేణి యాజమాన్యం, తాజాగా వారి పిల్లలకు ఉచిత విద్యను కల్పించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున బోనస్ చెల్లించారు. తాజా నిర్ణయంపై కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.