Asifabad: ఆసిఫాబాద్‌లో ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్
Asifabad: కుమ్రం భీమ్ జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన ఆసిఫాబాద్ పోలీసులు.
Asifabad: ఆసిఫాబాద్‌లో ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్
ఆసిఫాబాద్: కొమరం భీం జిల్లా జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టులను ఆసిఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ టుడేకు చెందిన బుతే దేవేందర్, సూరన్న టీవీకి చెందిన డుప్త సురేష్ నిందితులుగా ఉన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 5న ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా.. ఇద్దరూ పరస్పరం కుమ్మక్కై అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
రాధిక ట్రేడర్స్ యజమానితో ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఆ దుకాణాన్ని మూసివేయించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దుకాణానికి లైసెన్సులు, సంబంధిత రికార్డులు సక్రమంగా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలిందన్నారు.
అనంతరం నిందితులు ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యవసాయ అధికారిపై ఒత్తిడి తెచ్చి తొలుత రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపుల ద్వారా జూలై 26న రూ.1.30 లక్షలు నగదుగా తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, స్క్రీన్‌షాట్లను పోలీసులు సేకరించారు.
ఈ నెల 7న ఆసిఫాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదిలా ఉండగా.. నిందితుల్లో ఒకరిపై గతంలో కాగజ్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఆరోపణలపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల పరిశీలనలో వెల్లడైందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ బి.అశోక్ చెప్పారు. డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్, ఇతర సాక్ష్యాలను సేకరించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నేరం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఆసిఫాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.