Health: ఒత్తిడి ఎక్కువైతే శ‌రీరం ముందుగానే హెచ్చ‌రిస్తుంది.. మొటిమ‌ల నుంచి జీర్ణ స‌మ‌స్య‌ల వ‌ర‌కు సంకేతాలు

Health: Health: ప్రస్తుతం ఒత్తిడి అనేది చాలా మంది జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలు.. ఇలా ఎన్నో అంశాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.

Update: 2026-07-21 09:04 GMT

Health: ఒత్తిడి ఎక్కువైతే శ‌రీరం ముందుగానే హెచ్చ‌రిస్తుంది.. మొటిమ‌ల నుంచి జీర్ణ స‌మ‌స్య‌ల వ‌ర‌కు సంకేతాలు

Health: ప్రస్తుతం ఒత్తిడి అనేది చాలా మంది జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలు.. ఇలా ఎన్నో అంశాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే కొద్దిపాటి ఒత్తిడి సహజమే అయినా, అది ఎక్కువకాలం కొనసాగితే శరీరం అనేక హెచ్చరిక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి డిప్రెషన్‌తో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

స్ట్రెస్ వచ్చినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది?

మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ప్రమాద పరిస్థితిని ఎదుర్కొనేలా సిద్ధం చేస్తాయి. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులలో చెమట పట్టడం, ఒక్కసారిగా కడుపు అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం పడటం ప్రారంభమవుతుంది.

జీర్ణ సమస్యలు, జుట్టు రాలడం.. స్ట్రెస్‌కు ప్రధాన సంకేతాలు

దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉంటే కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచూ వేధించవచ్చు. కార్టిసాల్ హార్మోన్ జీర్ణక్రియను నెమ్మదింపజేయడంతో ఈ ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువకాలం ఒత్తిడిలో ఉంటే జుట్టు సహజంగా పెరిగే ప్రక్రియ దెబ్బతిని, జుట్టు అధికంగా రాలడం లేదా పలుచబడటం ప్రారంభమవుతుంది.

చర్మం, వ్య‌క్తిగ‌త‌ జీవితంపై కూడా ప్రభావం

స్ట్రెస్ వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా కార్టిసాల్ స్థాయి పెరగడంతో చర్మంలో ఆయిల్ ఉత్పత్తి అధికమవుతుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. మరోవైపు మానసిక ఒత్తిడి, నిరంతర అలసట, జీర్ణ సమస్యల వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల వీర్యకణాల నాణ్యత, సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.

గుండె వేగం పెరగడం, బీపీ అధికం కావడం ప్రమాదకరం

స్ట్రెస్ ఎక్కువకాలం కొనసాగితే గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో రక్తపోటు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చాలా రోజుల పాటు కొనసాగితే అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

ఈ లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి?

ఒత్తిడి వల్ల వచ్చే లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని చిన్న సమస్యగా భావించకూడదు. కడుపు సమస్యలు ఎక్కువకాలం ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను, గుండె వేగం లేదా బీపీ సమస్యలు ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించడం మంచిది. అలాగే ప్రతిరోజూ తగిన నిద్ర, వ్యాయామం, ధ్యానం, యోగా, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చు. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవాలి.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు తీవ్రమైన లేదా ఎక్కువకాలం కొనసాగుతున్న లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.

Tags:    

Similar News