Cancer: శరీరంలో ఈ చిన్న మార్పులు కూడా క్యాన్సర్ కు సంకేతాలు కావొచ్చు
Cancer: భారత్‌లో ప్రతి ఏడాది క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో కూడా నమోదవుతోంది.
Cancer: శరీరంలో ఈ చిన్న మార్పులు కూడా క్యాన్సర్ కు సంకేతాలు కావొచ్చు
Cancer: భారత్‌లో ప్రతి ఏడాది క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో కూడా నమోదవుతోంది. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
భారత్‌లో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
జాతీయ క్యాన్సర్ నివారణ, పరిశోధన సంస్థ (NICPR) నివేదిక ప్రకారం దేశంలో ప్రతి ఏడాది సుమారు 14 నుంచి 16 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ప్రకారం ప్రతి ఏడాది క్యాన్సర్ కేసులు 12 నుంచి 28 శాతం వరకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి 9 మందిలో ఒకరికి జీవితకాలంలో ఏదో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్యం, ఊబకాయం వంటి కారణాలు క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకండి
శరీరంలో కొన్ని మార్పులు పదే పదే కనిపిస్తే అవి సాధారణ సమస్యలుగా భావించకూడదు. చాలా రోజుల పాటు మలబద్ధకం లేదా విరేచనాలు కొనసాగడం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం లేదా మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం. మలంలో లేదా మూత్రంలో రక్తం కనిపించడం, తరచూ అజీర్ణం, కడుపు నిండినట్లు అనిపించడం, ఆహారం మింగడానికి ఇబ్బంది పడటం. వంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో పేగులు, జీర్ణాశయం లేదా మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్‌కు సంకేతాలుగా ఉండే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరంపై కనిపించే ఈ మార్పులు కూడా హెచ్చరికలే
చర్మంపై గాయం, నోటిలో పుండు లేదా ఏదైనా గాయం చాలా రోజులైనా తగ్గకపోతే దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది చర్మ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతం కావచ్చు. అలాగే రొమ్ము, మెడ, వృషణాలు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో కొత్తగా గడ్డ లేదా వాపు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. క్యాన్సర్ ప్రారంభ దశలో ఏర్పడే గడ్డలు చాలాసార్లు నొప్పి కలిగించవు. అందువల్ల నొప్పి లేదని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
దగ్గు, రక్తస్రావం వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దు
కొన్ని వారాల పాటు దగ్గు తగ్గకపోవడం, గొంతు బొంగురుగా మారడం లేదా స్వరంలో మార్పు రావడం వంటి లక్షణాలు ఊపిరితిత్తులు, గొంతు లేదా థైరాయిడ్ క్యాన్సర్‌తో సంబంధం ఉండే అవకాశం ఉంది. అలాగే దగ్గుతో రక్తం రావడం, మలంలో రక్తం కనిపించడం లేదా మహిళల్లో అసాధారణ రక్తస్రావం జరగడం వంటి పరిస్థితులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. వీటికి కారణం ఏమిటో పరీక్షల ద్వారా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా చేయవచ్చు. రోగి పూర్తిగా కోలుకునే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అందుకే శరీరంలో అసాధారణ మార్పులు కొన్ని వారాల పాటు కొనసాగితే వాటిని సాధారణ సమస్యగా భావించి వదిలేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఈ లక్షణాలు కనిపించాయని మాత్రమే క్యాన్సర్ ఉందని భావించాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలకు ఇతర సాధారణ కారణాలు కూడా ఉండొచ్చు. కానీ లక్షణాలు పదేపదే వస్తుంటే లేదా ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడి సలహా తీసుకుని అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యానికి మంచిది.