ఉదయం చేసినా సాయంత్రం వరకు కరకరలాడే పూర్ణం బూరెలు.. ఇలా చేయండి!
పండుగకు పూర్ణం బూరెలు ఇలా చేయండి. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఉదయం చేసినా సాయంత్రం వరకు బూరెలు క్రిస్పీగా ఉంటాయి.
Purnam Boorelu
పూర్ణం బూరెలు: పండుగలు, శుభకార్యాల సమయంలో తప్పకుండా చేసుకునే సంప్రదాయ తెలుగు వంటకాల్లో పూర్ణం బూరెలకు ప్రత్యేక స్థానం ఉంది. బయట క్రిస్పీగా, లోపల మెత్తటి తియ్యటి పూర్ణంతో ఉండే ఈ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఉదయం తయారు చేసినా సాయంత్రం వరకు బూరెలు క్రిస్పీగా ఉండేలా చేసుకోవచ్చు.
పూర్ణం బూరెల పైపిండి కోసం ఒక కప్పు మినప్పప్పును శుభ్రంగా కడిగి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. అదే కొలతతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టుకోవాలి.
ఇక పూర్ణం తయారీ కోసం ఒక కప్పు శెనగపప్పును కడిగి ఒకటిన్నర కప్పుల నీటితో గంటపాటు నానబెట్టాలి. అనంతరం కుక్కర్‌లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన పప్పును మరీ మెత్తగా కాకుండా లైట్‌గా మెదపాలి. ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసి బాగా కలపాలి.
పప్పు, బెల్లం మిశ్రమాన్ని స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. ఇందులో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, నాలుగైదు యాలకులను మెత్తగా గ్రైండ్ చేసి కలపాలి. అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిగా ముద్దలా మారే వరకు ఉడికించి పూర్తిగా చల్లార్చాలి.
ఇప్పుడు నానబెట్టిన మినప్పప్పును తక్కువ నీటితో గట్టిగా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినప్పిండిని ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిలో వేసి బాగా కలపాలి. పైపిండి మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి సరైన చిక్కదనానికి తీసుకురావచ్చు.
చల్లారిన పూర్ణంతో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పైపిండిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలపాలి. పూర్ణం ఉండలను ఈ పిండిలో ముంచి అన్ని వైపులా సమంగా కోట్ చేయాలి.
బూరెలు క్రిస్పీగా రావాలంటే నూనెను బాగా వేడి చేసి, ఆ తర్వాత మంటను మీడియంకు తగ్గించాలి. బూరెలు పూర్తిగా మునిగేంత నూనె ఉండాలి. నూనెలో వేసిన వెంటనే వాటిని కదపకుండా కొద్దిసేపు వేయించాలి. పైపిండి గట్టిపడిన తర్వాత అటూ ఇటూ తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ముఖ్యంగా నూనె మంటను మీడియంలో ఉంచి నెమ్మదిగా వేయించడం వల్ల బూరెలు లోపల కూడా చక్కగా ఉడికి, బయట క్రిస్పీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేస్తే ఉదయం చేసిన పూర్ణం బూరెలు సాయంత్రం వరకు కరకరలాడేలా ఉంటాయి.