Chicken Biryani: చికెన్ పొట్లం బిర్యానీ.. 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే స్పెషల్ రెసిపీ!
Chicken Biryani: చికెన్ పొట్లం బిర్యానీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. అరటి ఆకులో ఘుమఘుమలాడే స్పెషల్ బిర్యానీ రెసిపీ.
Chicken Biryani: చికెన్ పొట్లం బిర్యానీ.. 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే స్పెషల్ రెసిపీ!
Chicken Biryani: సాధారణంగా అందరూ దమ్ బిర్యానీని ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన బిర్యానీ తినడం కంటే.. కాస్త కొత్తగా, వెరైటీగా చికెన్ పొట్లం బిర్యానీ తయారు చేసుకుంటే ఆ రుచే వేరు. అరటి ఆకులో బిర్యానీ రైస్, చికెన్ గ్రేవీని పొట్లంలా కట్టి ఆవిరిపై ఉడికించడం ఈ రెసిపీ ప్రత్యేకత. అరటి ఆకు సువాసన, మసాలాల ఘుమఘుమలు కలిసి బిర్యానీకి అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ స్పెషల్ చికెన్ పొట్లం బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందాం.
చికెన్ పొట్లం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు
బిర్యానీ రైస్ కోసం:
బాస్మతి బియ్యం – 1½ కప్పులు
నూనె – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
షాజీరా – 1 టేబుల్ స్పూన్
యాలకులు – 3 నుంచి 4
లవంగాలు – 4 నుంచి 5
దాల్చినచెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకు – 1
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
పచ్చిమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – తగినంత
వేడినీళ్లు – 2¾ కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర, పుదీనా – కొద్దిగా
చికెన్ గ్రేవీ కోసం:
చికెన్ – అర కిలో
ఉల్లిపాయలు – 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు – అర కప్పు
జీడిపప్పు – తగినంత
కొబ్బరిపాలు – ¾ కప్పు
పచ్చిమిర్చి – 3 నుంచి 4
స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ – కొద్దిగా
యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క – తగినంత
బిర్యానీ మసాలా లేదా గరం మసాలా – తగినంత
పుదీనా, కొత్తిమీర – కొద్దిగా
నూనె, ఉప్పు – తగినంత
పొట్లం కట్టడానికి:
అరటి ఆకులు
నెయ్యి
వేయించిన ఉల్లిపాయలు
కొత్తిమీర, పుదీనా
బిర్యానీ రైస్ తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద పాన్ తీసుకుని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు అందులో వేడినీళ్లు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడకకుండా సుమారు 70 శాతం మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. బియ్యం గింజలు విరిగిపోకుండా పొడిపొడిగా ఉండేలా పక్కన పెట్టుకోవాలి.
చికెన్ గ్రేవీ తయారీ ఇలా..
మరో పాన్‌లో నూనె వేసి వేడయ్యాక స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి పెద్ద మంటపై వేయించాలి. చికెన్ నుంచి వచ్చే నీరు పూర్తిగా ఆవిరై నూనె పైకి తేలిన తర్వాత పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అనంతరం బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసి బాగా కలపాలి.
మరోవైపు జీడిపప్పును కొద్దిగా నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చికెన్‌లో వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. చికెన్ గ్రేవీ సిద్ధమైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరిపాలు వేసి బాగా కలపాలి.
అరటి ఆకులో పొట్లం ఎలా కట్టాలి?
ముందుగా అరటి ఆకులను కొద్దిగా వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకులు మెత్తగా మారి పొట్లం కట్టడానికి అనువుగా ఉంటాయి. ఇప్పుడు అరటి ఆకుపై కొద్దిగా బిర్యానీ రైస్ వేసి దానిపై చికెన్ గ్రేవీని వేయాలి. మళ్లీ దానిపై బిర్యానీ రైస్ పొర వేయాలి.
ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు, కొద్దిగా నెయ్యి వేసి అరటి ఆకును జాగ్రత్తగా పొట్లంలా కట్టాలి. పొట్లం విడిపోకుండా దారంతో గట్టిగా కట్టుకోవాలి.
10 నిమిషాలు స్టీమింగ్.. ఘుమఘుమలాడే బిర్యానీ రెడీ!
ఇప్పుడు సిద్ధం చేసుకున్న పొట్లాలను స్టీమర్లో పెట్టి సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. స్టీమింగ్ పూర్తయిన తర్వాత మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే చికెన్ పొట్లం బిర్యానీ సిద్ధం.
అరటి ఆకు సువాసనతో పాటు చికెన్ మసాలా రుచులు అన్నంలోకి బాగా చేరి ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. వేడివేడిగా రాయితాతో కలిపి తింటే ఆ మజానే వేరు. ఇంట్లోనే ఈ వెరైటీ బిర్యానీని తయారు చేసుకుని కుటుంబ సభ్యులకు అందించండి.