Nandyal: జూపాడుబంగ్లాలో రైతుల కన్నీటి నిరసన కేసీ కెనాల్‌లో పురుగుల మందు డబ్బాలతో ధర్నా!
Nandyal: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా వద్ద కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎండిపోయిన కాలువలో పురుగుల మందు డబ్బాలతో రైతులు వినూత్న నిరసన.
Nandyal: జూపాడుబంగ్లాలో రైతుల కన్నీటి నిరసన కేసీ కెనాల్‌లో పురుగుల మందు డబ్బాలతో ధర్నా!
Nandyal: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా వద్ద మంగళవారం రైతుల ఆవేదన కట్టలు తెంచుకుంది. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వినూత్న నిరసనకు దిగారు. ఎండిపోయిన కేసీ కెనాల్‌లోకి పురుగుల మందు డబ్బాలను చేతబట్టుకుని దిగి.. నీరు విడుదల చేయకపోతే తమకు చావే దిక్కంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
కేసీ కెనాల్ పరిధిలో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మినుము పంటలను సాగు చేశామని రైతులు తెలిపారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఒక్క తడి కూడా అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంటలు ఎండిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని వాపోయారు.
కేసీ కెనాల్‌ను నమ్ముకుని జీవిస్తున్న నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడ్తూరు మండలాల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 875 అడుగులకు పైగా నీరు నిల్వ ఉన్నప్పటికీ కేసీ కెనాల్‌కు ఒక్క చుక్క నీరు విడుదల చేయకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా వెంటనే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తేనే పంటలు బతుకుతాయని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సమయానికి నీరు అందేదని, ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమను పూర్తిగా విస్మరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మాకు నీళ్లు ఇవ్వండి.. లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తాం. మా చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో రాయలసీమ రైతన్నకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండేదని,అటువంటిది ఇప్పటి కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని,రైతు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని వాపోయారు.
ప్రస్తుతమున్న యెల్నినో ప్రభావం వలన రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కూటమి ప్రభుత్వం తక్షణమే కె.సి కెనాల్ కు నీరు విడుదల చేసి అందుకోవాలని డిమాండ్ చేశారు.
రాయలసీమలో నీటి కోసం ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోందని రైతులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.