Kurnool: 15 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు

Kurnool: కర్నూలు జిల్లాలో 15 వేల హెక్టార్లకు ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపు.

Update: 2026-06-02 12:28 GMT

Kurnool: 15 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు

కర్నూలు: జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని 15 వేల హెక్టార్లకు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు మండలంలోని తొలిసాపురం గ్రామంలో గోవర్ధన్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టర్ రైతు గోవర్ధన్ రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించి, అక్కడ అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ విధానం, అంతర పంటల సాగు వివరాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు... డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలోని వివిధ భాగాల వినియోగం, నిర్వహణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్క్రీన్ ఫిల్టర్, వాల్వులు, హెడ్ కంట్రోల్ యూనిట్ (హెచ్‌సీయూ) వంటి పరికరాల ప్రాముఖ్యతతో పాటు, డ్రిప్ ద్వారా ఎరువుల పంపిణీ చేసే ఫెర్టిగేషన్ విధానంపై రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కాలానుగుణ పంటలతో పాటు దీర్ఘకాలిక పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా మామిడి, జామ, నిమ్మ తదితర దీర్ఘకాలిక తోటల పంటలన్నింటిలో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి పొదుపుతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన రైతులకు విస్తృత అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. గత ఏడాది జిల్లాలో 8,260 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్‌ను అమలు చేశామని, ఈ ఏడాది 10,000 హెక్టార్లలో నిర్దేశించిన డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డ్వామా పిడి నరసింహ రెడ్డి, ఏపీఎంఐపీ పిడి శ్రీనివాసులు, ఉద్యాన శాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ ఏపిడి ఫిరోజ్, కర్నూలు తహశీల్దార్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News