Kurnool: అక్టోబర్ 2 నాటికి చెత్త కుప్పల తొలగింపు పూర్తి చేయాలి కలెక్టర్ సిరి
Kurnool: కర్నూలు జిల్లాలో లెగసీ వ్యర్థాల తొలగింపు పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు.
Kurnool: అక్టోబర్ 2 నాటికి చెత్త కుప్పల తొలగింపు పూర్తి చేయాలి కలెక్టర్ సిరి
కర్నూలు: అక్టోబర్ 2 నాటికి లెగసీ వ్యర్థాల (చాలా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త కుప్పలు) తొలగింపు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ లను, పబ్లిక్ హెల్త్ ఈఈ లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర, అమృత్ 2.0, పబ్లిక్/కమ్యూనిటీ టాయిలెట్ల పురోగతి, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలలో సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలు (చాలా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త కుప్పలు) ఉండగా, ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల నిర్వహణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన లెగసీ వ్యర్థాల తొలగింపు పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను, పబ్లిక్ హెల్త్ ఈఈ లను ఆదేశించారు.
ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియలో ఏవైనా పెండింగ్‌లు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి మూడు మున్సిపాలిటీలలో పనులు ప్రారంభమయ్యాయని, గూడూరు మున్సిపాలిటీలో ఇంకా పనులు ప్రారంభం కాలేదని, గూడూరులో కూడా వెంటనే పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.
అమృత్ 2.0 పథకం కింద మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన ప్రారంభించి, గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే, నీటి వనరుల పునరుజ్జీవనానికి సంబంధించిన పనులను కూడా త్వరలో ప్రారంభించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలన్నారు..సెప్టెంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో ప్లాంటేషన్ ( మొక్కలు నాటే) లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలన్నారు.
కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లలో ఏర్పాటు చేయనున్న FSTPల పనులను వేగవంతం చేయాలన్నారు. టెండర్లు, ఏజెన్సీల ఎంపికలో జాప్యం ఉంటే వెంటనే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. 10 రోజుల్లోగా బల్క్ వేస్ట్ జనరేటర్ల పూర్తి వివరాలు సేకరించి, సెప్టెంబర్ 6 నాటికి స్వీయ వ్యర్థ నిర్వహణ చేయని వారందరికీ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలోని 484 పంచాయతీలకు గాను 426 SWPC షెడ్లు నిర్మాణం పూర్తయిందని, మిగిలిన షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ఇప్పటికే నిర్మించిన షెడ్లలో ఎక్కడైనా నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేకుంటే 10 రోజుల్లోగా కల్పించాలని కలెక్టర్ డిపిఓ ను ఆదేశించారు . ఇటీవల జూలై నెలాఖరులో మంజూరైన సోక్ పిట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
స్వచ్ఛతలో ఉత్తమంగా ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీలు, రైతు బజార్లు, స్వచ్ఛ కాలనీలు, ఎన్జీఓ ఆర్గనైజేషన్ , దేవాలయాలు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు, రైల్వే స్టేషన్లు ఈ నెల 30 వ తేది లోపు గుర్తించి స్వచ్ఛ అవార్డులకు ప్రతిపాదించాలన్నారు..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను, డి పి ఓ ను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రకటనలు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు గ్రామ సభలను నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, డి పి ఓ భాస్కర్, సిపిఓ భారతి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ గుర్రప్ప, ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, గూడూరు మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.