Kurnool: జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి!
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నేతృత్వంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం. నేషనల్ హైవే పనులు, పీఎం రాహత్ ఉచిత వైద్య పథకంపై సమీక్ష.
Kurnool: జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి!
Kurnool: జాతీయ రహదారికి సంబంధించి అభివృద్ధి చేస్తున్న సర్వీస్ రోడ్లు, వాహన అండర్‌పాస్‌లు (VUP), బ్లాక్ స్పాట్‌ల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు రహదారి భద్రత చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి 10 రోజుల్లోగా పురోగతిపై తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే పనులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు గాను పాత కల్లూరు రోడ్డు నుండి హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ కేశవ్ గ్రాండ్ సమీపంలోని ప్రస్తుత రహదారిని అనుసంధానించే పనులలో భాగంగా వచ్చే నెల నాటికి ప్రగతి కనిపించేలా మెటల్ రోడ్డు పనులు ప్రారంభించి బస్సుల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు.
రాళ్లదొడ్డి గ్రామంలో ఎస్ కర్వ్ ఉన్నందున ప్రతిపాదిత రహదారి విస్తరణ పనులకు సంబంధించి రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో పనిచేసి వారం రోజులలోపు రహదారి సర్వే, మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు చేపట్టనున్న రోడ్ విస్తరణ పనులలో గణనీయమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఉల్చాల జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారులపై ఆక్రమణలు తొలగించడంతో పాటు రహదారి భద్రతకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు.. జాతీయ రహదారులపై పెట్రోలింగ్ వాహనాలను చురుగ్గా వినియోగించి, రహదారులపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్న భారీ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.. పెట్రోలింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు... హిట్ అండ్ రన్ కి సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాల్సిన కేసులు పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ (PM RAHAT) పథకం ద్వారా రూ.2.5 లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యం.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణమే నగదు రహిత (cashless) వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యవసర ఆరోగ్య సంరక్షణ పథకం పీఎం రాహత్ (PM RAHAT) పథకం అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు గాయాల తీవ్రత మరియు రకాన్ని బట్టి గరిష్టంగా ₹2,50,000 వరకు చికిత్స ఖర్పులు మంజూరు చేయబడతాయన్నారు.
ఈ పథకంలో సుమారు 58 నుండి 60 వరకు నిర్దిష్టమైన ఇంజురీ కోడ్స్ ఉంటాయని, బాధితుడి గాయాల స్థితిని బట్టి సంబంధిత కోడ్ ఆధారంగా ఆయా అమౌంట్ రిలీజ్ చేయబడుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్వక్తిని ఆసుపత్రికి చేర్చిన వ్వక్తిని (Good Samaritan) గా గుర్తించి ప్రోత్సాహకంగా పురస్కారం ఇవ్వబడుతుందన్నారు.
సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డిటిసి శాంతకుమారి, పంచాయతీ రాజ్ ఎస్ఈ ప్రభాకర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.