Kothagudem: త్వరలో హెడ్ పోస్టాఫీసులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం – ఎమ్మెల్యే కూనంనేని

Kothagudem: కొత్తగూడెం హెడ్ పోస్టాఫీసులో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.

Update: 2026-08-23 14:21 GMT

Kothagudem: త్వరలో హెడ్ పోస్టాఫీసులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం – ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో త్వరలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ఏర్పాటు కానుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం హెడ్ పోస్టాఫీసులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి తాను సమర్పించిన లేఖలు, చేసిన సంప్రదింపులపై అధికారులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అనుమతితో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీఎస్‌పీ డివిజన్ అండర్ సెక్రటరీ పరిశీలనకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు.

కొత్తగూడెం ప్రధాన పారిశ్రామిక, గనుల, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడంతో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, యువత సంఖ్య గణనీయంగా ఉందన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవల కోసం సుమారు 75 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం, మహబూబాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల వృద్ధులు, మహిళలు, విద్యార్థులు సహా ప్రజలు సమయం, డబ్బు వెచ్చిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో ఇక్కడే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఈ అంశంపై ప్రత్యేక చొరవతో కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు సాధించేందుకు కృషి చేస్తున్నామని కూనంనేని తెలిపారు. త్వరలోనే కేంద్రం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడి కొత్తగూడెం హెడ్ పోస్టాఫీసులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News