Kothagudem: సింగరేణి మారుపేర్ల బాధితుల దీక్షకు బీఆర్‌ఎస్ మద్దతు!
Kothagudem: కొత్తగూడెంలో సింగరేణి మారుపేర్ల బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్ మద్దతు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ రవీందర్‌రావు.
Kothagudem: సింగరేణి మారుపేర్ల బాధితుల దీక్షకు బీఆర్‌ఎస్ మద్దతు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్‌రావు మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం మారుపేర్లతో సింగరేణి సంస్థలో ఉద్యోగాల్లో చేరిన వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మారుపేర్ల కారణంగా ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిలో 15 వేల కారుణ్య నియామకాలు చేపట్టారని, 3,200 పెండింగ్ ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. దాదాపు 5,500 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాలను కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.
భూపాలపల్లిలో జరిగిన సమావేశంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలను గెలిపిస్తే రెండు నెలల్లో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని రవీందర్‌రావు గుర్తుచేశారు. యూనియన్ ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూడా పలు హామీలు ఇచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.
సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఆబ్సెంటీజం కారణంగా ఏ ఒక్క సింగరేణి కార్మికుడిని డిస్మిస్ చేయలేదని, గతంలో డిస్మిస్ అయిన సుమారు 800 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.
సింగరేణి సంస్థలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిసింగ్ నాయక్, లక్కినేని సురేందర్, వగ్గెల పూజ, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్లు తుమ్మ శ్రీనివాస్, గడప రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్‌గౌడ్‌తో పాటు దన్నాడ రాజు, ఓంప్రకాశ్, షేక్ బాబర్, పిట్టల అనిల్, సాయికిరణ్, అశోక్, కొల్లిపాక అన్వేష్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.