Burgampahad: వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్!
Burgampahad: బూర్గంపాడు మండలం వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
Burgampahad: వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్!
బూర్గంపాడు: బూర్గంపాడు మండలం వేపలగడ్డలోని గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించి వారి చదివే సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించి, పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా చదవాలని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రోత్సహించారు.
అనంతరం తెలుగు, గణిత పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగు అక్షరాలు, వర్ణమాల రాయించి వారి రాత నైపుణ్యాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యలను గుర్తించడం, కూడికలు, తీసివేతలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రాథమిక గణిత పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థుల చేత బ్లాక్ బోర్డుపై అక్షరాలు, సంఖ్యలు రాయించి వారి అభ్యసన స్థాయిని స్వయంగా అంచనా వేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడిన కలెక్టర్ పాఠశాలలో మొదటి, రెండో తరగతుల విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఉద్దీపన కార్యక్రమాల అమలు, రాత సాధన, ఇంగ్లీష్, గణిత బోధనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ తరగతుల్లో విద్యార్థుల హాజరు పరిస్థితిపై ఆరా తీశారు. మొదటి, రెండో తరగతుల విద్యార్థులకు అక్షరాలు, సంఖ్యల గుర్తింపు, చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను నేర్పిస్తున్న విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మమేకమై వారి పేర్లు అడిగి తెలుసుకుంటూ, చదువులో ఆసక్తి పెంపొందించేలా ప్రోత్సహించారు. విద్యార్థులు భయం లేకుండా ఉపాధ్యాయులతో, అధికారులతో మాట్లాడేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు.
పాఠశాలలో విద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా బోధనా కార్యక్రమాల అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ తనిఖీలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.