Karimnagar: మే 5 నిరాహార దీక్షకు ఉద్యోగులు భారీగా పాల్గొనాలి: జేఏసీ
Karimnagar: మే 5న నిర్వహించనున్న నిరాహార దీక్షలో ప్రతి ఉద్యోగి పాల్గొనాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ పిలుపునిచ్చింది.
Karimnagar
Karimnagar: తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో మే 5న నిర్వహించనున్న ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జేఏసీ భాగస్వామ్య పక్షాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు మారం జగదేశ్వర్ మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రతి ఉద్యోగి పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి చేరవేసే బాధ్యత ఉద్యోగులదేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ఉద్యోగులకు సంబంధించిన కీలక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయని, డీఏలు, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని, అలాగే పలు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
జిపిఎఫ్ నిధులు, సరెండర్ లీవ్ బిల్లులు, టీజీఎల్ఐఎఫ్ ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర ఏరియర్స్ చెల్లింపులు ఆలస్యమవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిఎస్ పునరుద్ధరణ, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
హెల్త్ కార్డు పథకం సక్రమంగా అమలు కావడం లేదని, ఎంపానెల్డ్ ఆస్పత్రులు ఖరారు చేయకపోవడంతో ఉద్యోగులు వైద్య సేవల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌లో జరుగుతున్న జాప్యంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఐక్యంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మే 5న జరిగే నిరాహార దీక్షలో ప్రతి ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.