Sircilla: పోక్సో కేసులో డ్యాన్స్ మాస్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష!
Sircilla: మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్యాన్స్ మాస్టర్ జంగ్లి రఘుకు పోక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
Sircilla: పోక్సో కేసులో డ్యాన్స్ మాస్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష!
సిరిసిల్ల: సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెల్లడించారు.
సిరిసిల్లలోని ఓ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన జంగ్లి రఘు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల సీఐ ఉపేందర్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్దన్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల 8 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జాన్సీ వాదించగా.. శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితుడు జంగ్లి రఘుకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు.
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేస్తూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి సీఐ ఉపేందర్, ప్రస్తుత సీఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్, కోర్టు కానిస్టేబుల్ జనార్దన్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికను ఎస్పీ అభినందించారు.