Peddapalli: పెద్దపల్లి రైల్వే పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీ వంశీకృష్ణ!

Peddapalli: దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ. రూ.1000 కోట్ల పెండింగ్ రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్.

Update: 2026-08-21 06:47 GMT

Peddapalli: పెద్దపల్లి రైల్వే పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీ వంశీకృష్ణ!

Peddapalli: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశంలో లేక ద్వారా డిమాండ్ చేశారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై ఎంపీలతో కలిసి రైల్వే జనరల్ మేనేజర్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే సమస్యలు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రయాణికుల అవసరాలు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించాల్సినీ . నియోజకవర్గ ప్రజల రాకపోకలకు అనుగుణంగా రైల్వే సేవలను మెరుగుపరచడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని రైళ్లు కేటాయించడం, ముఖ్యమైన రైళ్లకు అదనపు స్టాపేజీలు కల్పించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల నిధులతో మంజూరైన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. 1,000 కోట్లకు పైగా విలువైన ROBలు, FOBలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చినా ఆన్‌గ్రౌండ్‌లో పనులు ప్రారంభం కాకపోవడం తీవ్ర విచారకరం అని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.

శాంక్షన్ ఇచ్చి పనులు చేయకపోతే ఆ నిధులు ఎందుకు? ప్రజల కోసం మంజూరైన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాకుండా నేలమీద కనిపించాలని వంశీకృష్ణ స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి ఒక్కో స్టేషన్‌కు సుమారు 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తున్నామని, ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి నుంచి రైల్వేకు భారీగా ఫ్రైట్ ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో పెద్దపల్లి ప్రాంతానికి రైల్వే మౌలిక వసతులు కల్పించకపోవడం పట్ల ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సింగరేణి, బొగ్గు గనుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, రైల్వే సరుకు రవాణాకు పెద్దపల్లి భారీగా ఆదాయం అందిస్తున్నా, పెద్దపల్లికి రావాల్సిన అభివృద్ధి మాత్రం ఎందుకు ఆగిపోవాలి? అని ప్రశ్నించారు. ఇది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదనీ, ప్రజల సొమ్ము. పెద్దపల్లి ప్రజల హక్కు. మంజూరైన ప్రతి రూపాయి అభివృద్ధి పనుల్లో ఖర్చు కావాల్సిందే అని వంశీకృష్ణ తేల్చిచెప్పారు.

బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతాల పట్ల వివక్ష చూపుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి సమాధానం కోరుతామని తెలిపారు. పెద్దపల్లి హక్కుల కోసం ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని, మంజూరైన ప్రతి రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర రైల్వే శాఖ స్థాయిలో నిరంతరం కృషి చేస్తూ ,ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను కోరారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రస్తావించిన అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News