Karimnagar: "అన్నా కూర్చో" అన్నందుకు ఎస్‌ఐ దాడి.. చివరకు సస్పెన్షన్!

Karimnagar: కరీంనగర్‌లో ఘోరం! హెయిర్ సెలూన్ కార్మికుడిపై దాడి చేసిన ఎస్‌ఐ చైతన్య చందర్‌పై సస్పెన్షన్ వేటు.

Update: 2026-04-26 01:57 GMT

Karimnagar: "అన్నా కూర్చో" అన్నందుకు ఎస్‌ఐ దాడి.. చివరకు సస్పెన్షన్!

Karimnagar: కరీంనగర్ నగరంలోని దుర్గమ్మగడ్డ, ఖాన్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక హెయిర్ కట్టింగ్ సెలూన్ ‌లో పోలీసు అధికారి ప్రవర్తనకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

​శనివారం తేదీ 25 ఏప్రిల్ 2026 ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో కరీంనగర్ III టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎన్. చైతన్య చందర్, 'న్యూ ప్రజా హెయిర్ స్టైల్' సెలూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో షాప్ శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికుడు పగడాల రాము (50) ఎస్‌ఐను చూసి మర్యాదపూర్వకంగా “అన్నా కూర్చో” అని పలికారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఐ, బాధితుడిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అతనిపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ సెలూన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

​ఘటన జరిగిన సమయంలో ఎస్‌ఐ చైతన్య చందర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బందోబస్త్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు విచారణలో తేలింది. ​సామాన్య పౌరుడిపై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం మరియు విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణ నివేదికలో స్పష్టమవ్వడంతో.. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మరియు రాజన్న జోన్-III డి.ఐ.జి. సిఫారసు మేరకు ఉన్నతాధికారులు సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. సామాన్య ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినా, చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసినా ఎంతటి వారినైనా సహించేది లేదు. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని కరీంనగర్ సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Tags:    

Similar News