Peddapalli: ఎల్ నినో కరవు దృష్ట్యా ఆరుతడి పంటలే మేలు.. పెద్దపల్లి ఏఓ!
Peddapalli: ఎల్ నినో కరవు నేపథ్యంలో వరి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పెద్దపల్లి ఏఓ నాగార్జున రైతులకు సూచించారు. మొక్కజొన్న, శెనగ, పల్లి వంటి పంటలపై అవగాహన కల్పించారు.
Peddapalli: ఎల్ నినో కరవు దృష్ట్యా ఆరుతడి పంటలే మేలు.. పెద్దపల్లి ఏఓ!
Peddapalli: పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి డి. నాగార్జున ఆధ్వర్యంలో కొత్తపల్లి క్లస్టర్ పరిధిలోని పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల గ్రామాల్లో ఎల్ నినో కరవు దృష్ట్యా ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఓ నాగార్జున మాట్లాడుతూ, గత వానాకాలం సీజన్లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడటంతో సాగునీటి ప్రాజెక్టులు నిండలేదని తెలిపారు. ఈ యాసంగి పంట కాలానికి కూడా సాగునీరు కాలువల ద్వారా రాదని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
ఈ చలికాలం నుండే ఎండల తీవ్రత పెరగడం, అలాగే వాతావరణ శాఖ సూచనల ప్రకారం జనవరి నుండి సూపర్ ఎల్ నినో తీవ్రత ఇంకా పెరిగే అవకాశం వల్ల బావులు, బోర్లు, చెరువుల్లో నీళ్లు అడుగంటి వరి పంట మధ్యలోనే ఎండి రైతుకు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతతో సులువుగా చేతికి వచ్చే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, శెనగ, పల్లి, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆముదం వంటి పంటలు రైతులు సాగు చేయాలని సూచించారు.
ముఖ్యంగా ఎకరా వరికి సరిపడే నీళ్లు 3 ఎకరాల మొక్కజొన్న పంటకు సరిపోతాయని, అలాగే మొక్కజొన్న పంటతో ఎకరాకి రూ.70 వేల నుండి రూ.లక్ష వరకు కూడా ఆదాయం పొందవచ్చని తెలిపారు.
కావున రైతులు దయచేసి ఎక్కువ నీళ్లు అవసరం ఉండే వరి పంట సాగు చేసి నష్టపోకుండా, తక్కువ నీటితో సాగు అయ్యే ఆరుతడి పంటలు సాగు చేసి ఈ యాసంగిలో కూడా మంచి ఆదాయం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి కల్పన, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల నరేష్, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ పెర్క రిబ్కా, మూలసాల గ్రామ సర్పంచ్ జూపాక శ్వేత, పెద్దకల్వల గ్రామ సర్పంచ్ నర్ల కనకమ్మ, పెద్దబొంకూర్ సర్పంచ్ కల్వల తిరుపతి మరియు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.