Mydukur: ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ సమావేశంలో మేజిస్ట్రేట్ డాక్టర్ శంకర్!

మైదుకూరు: రోగుల సమస్యలను శ్రద్ధగా విని, వారి వ్యాధి నయం కావడానికి సరైన నిపుణులైన వైద్యులను సూచించడంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ సూచించారు.

​ఆదివారం ఉదయం కడప నగరంలోని కెమిస్ట్ భవనంలో 'వైఎస్ఆర్ కడప జిల్లా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్' సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వద్దకు వచ్చే రోగులకు సరైన వైద్యుల వివరాలు సూచించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవ చ్చన్నారు. భారతీయ వైద్య శాస్త్రానికి చరకుడు రచించిన 'చరక సంహిత', సుశ్రుతుడి గ్రంథాలే నేటికీ మార్గదర్శకమని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్వాహకులు నిపుణులైన వైద్యుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, మారుమూల పల్లె ప్రజలతో మమేకమై ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సౌకర్యాలపై అవగాహన కల్పించాలని కోరారు.

​ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు, ఏ ఆసుపత్రిలో ఎలాంటి నిపుణులు అందుబాటులో ఉన్నారనే తాజా సమాచారాన్ని రోగులు, వారి కుటుంబ సభ్యులకు అందించడం వల్ల వారిని ప్రాణాపాయం నుండి కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. గ్రామాలు ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, తద్వారా స్థూల దేశీయోత్పత్తి పెరిగి దేశ ప్రతిభ విశ్వవ్యాప్తమవుతుందని అభిప్రాయపడ్డారు.

​వైద్య రంగంలో మన ఋషి పరంపర నుండి నేటి వరకు సాధించిన గొప్పతనాన్ని డాక్టర్ శంకర్ వివరించినప్పుడు నిర్వాహకులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం చివరలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శంకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నిర్వాహకులు మల్లికార్జున, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: