US-Iran Peace Talks: ముగింపు దిశగా అమెరికా ఇరాన్ యుద్ధం... టెహ్రాన్‌లో కీలక చర్చలు
ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా ఇరాన్ యుద్ధం దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. టెహ్రాన్‌లో చర్చలు జరిపేందుకు అధికారులు సిద్దమౌతున్నారు.
US-Iran Peace Talks: యుద్ధ భయాల నుంచి శాంతి దిశగా మలుపు... టెహ్రాన్‌లో ఊపందుకున్న రహస్య దౌత్య చర్చలు. 3 గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో దాడి ప్రతిపాదనను ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పడిపోయిన ముడి చమురు ధరలు.
పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా అగ్గిరాజేస్తున్న ఉద్రిక్తతలు చివరకు శాంతి మార్గం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇరాన్‌పై పటిష్టమైన దాడికి సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని చర్చల వైపు మొగ్గు చూపడం ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాక్, ఒమన్ దేశాల ప్రతినిధులతో నిరంతరం జరిపిన రాయబారాలు ఈ సంక్షోభాన్ని సమసిపోయేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
ట్రంప్ కీలక ప్రకటన ... గల్ఫ్ మిత్రదేశాల విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌తో హోర్ముజ్ జలసంధిపై ఒడంబడిక కుదరబోతోందని ప్రకటించారు. ఇరాన్ అణు నిష్పత్తి ఒప్పందంపై కూడా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నేరుగా చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకే ఇరాన్ మౌలిక వసతులపై జరపాల్సిన వైమానిక దాడులను విరమించుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఒమన్ రాజధాని వేదికగా సాగిన సమాలోచనల ఆధారంగా టెహ్రాన్‌లో పరోక్ష చర్చల ప్రక్రియ వేగవంతమైంది.
హోర్ముజ్ జలసంధి ... వ్యూహాత్మక పట్టు
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ ఒమన్‌తో జరుగుతున్న చర్చలు కేవలం సముద్ర మార్గంలో నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించడానికేనని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిపై తమకున్న వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇరాన్ కాపాడుకుంటూనే, ఆంక్షల సడలింపుల కోసం దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. మునుపటి పరిస్థితులు వెంటనే పునరుద్ధరణ కావని వారు స్పష్టం చేశారు.
పడిపోయిన చమురు ధరలు ... ఊపిరి పీల్చుకున్న మార్కెట్లు
అమెరికా దాడులను విరమించుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గడిచిన నెల రోజుల్లో 20 శాతానికి పైగా పెరిగిన ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 4.08 డాలర్లు తగ్గి 83.85 డాలర్ల వద్దకు చేరింది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 4.01 డాలర్లు తగ్గి 80.66 డాలర్లకు చేరుకుంది. యుద్ధ మేఘాలు తొలగిపోయి శాంతి వాతావరణం నెలకొంటే ప్రపంచ ఆర్థిక రంగానికి, ముఖ్యంగా ఇంధన రవాణాకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.