China : గంటకు 144 కిమీ వేగంతో గాలులు..ఎగిరిపోతున్న ఇళ్లు.. చైనాను ముంచెత్తుతున్న ‘బావీ’ తుఫాన్
China : భీకరమైన బావీ తుఫాన్ చైనా తూర్పు తీరాన్ని వణికించింది. రికార్డు స్థాయిలో వీస్తున్న గాలులు, భారీ వర్షాల కారణంగా చైనా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Typhoon Bavi
China : చైనా తూర్పు తీర ప్రాంతాన్ని బావీ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. శనివారం రాత్రి ఈ భీకర తుఫాన్ చైనా తీరాన్ని తాకడంతో ఆయా ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీవ్రతను ముందే ఊహించిన చైనా ప్రభుత్వం, అత్యంత వేగంగా స్పందించి తీర ప్రాంతాల నుంచి ఏకంగా 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ శతాబ్దపు అత్యంత తీవ్రమైన తుఫాన్లలో ఒకటిగా భావిస్తున్న బావీ కారణంగా చైనా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాజధాని బీజింగ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో సహాయక, రక్షణ చర్యలను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది.
చైనాకు చెందిన జెజియాంగ్ ప్రాంత వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చైనాను తాకిన 9వ తుఫాన్‌గా బావీ రికార్డుకెక్కింది. శనివారం రాత్రి సుమారు 11 గంటల 20 నిమిషాల సమయంలో తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రాంత తీరాన్ని ఈ తుఫాన్ తాకింది. చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ షిన్హువా కథనం ప్రకారం.. యుహువాన్ నగర తీరప్రాంతాన్ని తాకిన సమయంలో గాలుల వేగం సెకనుకు 40 మీటర్లుగా నమోదైంది. అంటే గంటకు దాదాపు 144 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి తీరప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం తమ దేశంలోని నాలుగు అంచెల హెచ్చరికల వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాద సూచిక అయిన రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. వర్షాల కోసం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్‌ను కూడా అమలులోకి తెచ్చింది. రాబోయే 24 గంటల్లో జెజియాంగ్, ఉత్తర ఫుజియాన్, ఈశాన్య జియాంగ్సీ, దక్షిణ అన్హుయ్ వంటి దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం రాజధాని బీజింగ్, హెబీ ప్రాంతాలపై కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
ఈ బావీ తుఫాన్ ప్రభావం కేవలం చైనాపైనే కాకుండా పొరుగున ఉన్న తైవాన్, జపాన్ దేశాలపై కూడా బలంగా పడింది. తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తైవాన్ ఉత్తర భాగం గుండా ఈ తుఫాన్ ప్రయాణించినప్పుడు జరిగిన వివిధ ప్రమాదాల్లో కనీసం 113 మంది గాయపడ్డారు. అక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా 14,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తైవాన్ వ్యాప్తంగా శనివారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు జపాన్‌లోని ఒకినావా ప్రాంతానికి చెందిన దక్షిణ దీవుల్లో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో అధికారులు తీరప్రాంత వాసులను హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో నడిచే 200 కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు.