Sheikh Hasina: హసీనాను అప్పగించకపోతే ఐసీజేకు వెళ్తాం.. భారత్‌ను ఇరుకున పెట్టగలదా బంగ్లాదేశ్?
మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హసీనాను అప్పగించకపోతే ICJను ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అంశం భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతోంది. 2024 ఆగస్టు 5న విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. 2024 నిరసనల అణచివేత ఘటనల్లో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయంటూ బంగ్లాదేశ్ ప్రత్యేక కోర్టు 2025 నవంబర్‌లో ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఆ తీర్పును, ఆరోపణలను హసీనా తీవ్రంగా ఖండించారు. తాజాగా పాకిస్థాన్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్, హసీనాను అప్పగించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)కు వెళ్తామని హెచ్చరించారు. ఆమె బంగ్లాదేశ్ వస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 16న స్వదేశానికి వెళ్తారా?
విజయ్ దివస్ సందర్భంగా డిసెంబర్ 16న హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉందని ఆమె ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ గతంలో వెల్లడించారు. అయితే ఆమె ప్రయాణానికి విమానం పంపాలన్న అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చిందని, చట్టబద్ధమైన అప్పగింత ద్వారానే ఆమె రావాలని పట్టుబడుతోందని వార్తలు వచ్చాయి. దీనిపై నవంబర్ 25న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. హసీనా అప్పగింత అభ్యర్థనను నిబంధనల మేరకు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ప్రయాణ పత్రాలతో స్వదేశానికి వెళ్లడం వేరు, అప్పగింత ప్రక్రియ వేరు అని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ పర్యటనలో బంగ్లాదేశ్ స్పీకర్ 1971 యుద్ధంలో భారత్ పాత్రను ప్రశ్నించడం, కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
భారత్‌పై విచారణ జరుగుతుందా?
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రధాన న్యాయస్థానమైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దేశాల మధ్య న్యాయపరమైన వివాదాలను విచారిస్తుంది. కానీ ఒక దేశం పిటిషన్ వేయగానే విచారణ మొదలవదు. ఆ వివాదంపై కోర్టుకు అధికార పరిధి ఉండాలి. ఇందుకు సంబంధిత దేశాల అంగీకారం లేదా కోర్టు అధికారాన్ని అంగీకరించే ఒప్పందం అవసరం. 2019లో భారత్ ఐసీజే తప్పనిసరి అధికార పరిధిని అంగీకరిస్తూ చేసిన ప్రకటనలో కామన్వెల్త్ సభ్యదేశాలతో ఉన్న వివాదాలను మినహాయించింది. బంగ్లాదేశ్ 1972 నుంచి కామన్వెల్త్ సభ్యదేశంగా ఉన్నందున, ఈ అంశం భారత్‌కు కీలక న్యాయవాదనగా నిలుస్తుంది. అయితే అధికార పరిధిపై కోర్టు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వస్తుంది కాబట్టి, కేసు ఫలితంపై ఇప్పుడే ఏమీ ఖచ్చితంగా చెప్పలేం.
భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందంలోని కీలక అంశాలు
2013లో కుదిరిన అప్పగింత ఒప్పందానికి 2016లో సవరణలు చేశారు. ఇందులోని ఆర్టికల్ 6 ప్రకారం రాజకీయ స్వభావం ఉన్న నేరాలకు అప్పగింతను తిరస్కరించే అవకాశం ఉంది. కానీ హత్య, నరహత్య, తీవ్ర గాయాలు, కిడ్నాప్, కొన్ని ఉగ్రవాద నేరాలు రాజకీయ నేరాల కిందకు రావు. కాబట్టి హసీనాపై ఉన్న ఆరోపణల స్వభావం, ఆధారాల బలాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఇక ఆర్టికల్ 8 ప్రకారం, న్యాయ ప్రయోజనాల కోసం కాకుండా వేరే ఉద్దేశంతో ఆరోపణలు చేశారని లేదా అప్పగింత వల్ల అన్యాయం, అణచివేత జరుగుతుందని సంబంధిత వ్యక్తి నిరూపిస్తే తిరస్కరించే అవకాశం ఉంటుంది. విచారణ జరిగిన తీరును కూడా భారత్ పరిగణనలోకి తీసుకోవచ్చు.
భారత్ ముందున్న చట్టపరమైన మార్గాలు ఇవే
ఒప్పందంలోని ఆర్టికల్ 10 ప్రకారం అప్పగింత కోరే దేశం నేర వివరాలతో పాటు చట్టపరమైన పత్రాలు, ఆధారాలు, శిక్ష పడినట్లయితే తీర్పు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. సమాచారం సరిపోకపోతే మరిన్ని వివరాలు అడిగే హక్కు భారత్‌కు ఉంటుంది. అలాగే ఆర్టికల్ 7 ప్రకారం, అభ్యర్థన అందుకున్న దేశంలోనే విచారణ జరిపే అవకాశం ఉంటే అప్పగింత నిరాకరించి స్థానిక అధికారులకు పంపవచ్చు. వెరసి, హసీనా విషయంలో భారత్‌కు ఒప్పందపరమైన, దౌత్యపరమైన స్పష్టమైన చట్టబద్ధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.