Iran US Nuclear Talks: ఆ తప్పే అమెరికాకు కలిసి వచ్చిందా? ఒత్తిడి లేని డీల్‌ సాధ్యమౌతుందా?

Iran US Nuclear Talks: పాకిస్థాన్ వేదికగా అమెరికాతో జరిపిన చర్చలు ఇరాన్ పాలిట శాపంగా మారాయా? ఇరాన్ ఎంపీ మహమూద్ నబావియన్ వ్యాఖ్యలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే ఇరాన్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని స్పష్టమవుతోంది.

Update: 2026-04-24 05:34 GMT

Iran US Nuclear Talks

Iran US Nuclear Talks: పాకిస్థాన్ వేదికగా అమెరికాతో జరిపిన చర్చలు ఇరాన్ పాలిట శాపంగా మారాయా? ఇరాన్ ఎంపీ మహమూద్ నబావియన్ వ్యాఖ్యలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే ఇరాన్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడం, ఆర్థిక దిగ్బంధనం ముదరడం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనంతటికీ కారణం రాజకీయ చదరంగంలో ఇరాన్‌ చేసిన చిన్న తప్పేనని అంతర్జాతీయ నిపుణులు కూడా చెబుతున్నారు. చిన్న తప్పు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందో ఇరాన్‌ పరిస్థితి చూస్తే అర్థమౌతుంది. అమెరికాతో చర్చలకు వెళ్లడమే తాము చేసిన అతిపెద్ద పొరపాటని ఇరాన్‌ స్వయంగా అంగీకరించింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

పాక్ వేదికగా జరిగిన 'తప్పు' ఏంటి?

ఇరాన్‌ అమెరికా మధ్య పాకిస్తాన్‌ వేదికగా తొలి విడత చర్చలు జరిగాయి. సుమారు 21 గంటలపాటు సాగిన ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరాన్‌ డిమాండ్లను ఒప్పుకోకపోవడమే కాకుండా, అమెరికా పలు షరతులు విధించింది. అయితే, ఈ చర్చల్లో పాల్గొన్న ఇరాన్‌ పార్లమెంట్‌ సభ్యుడు మహమూద్‌ నబావియన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయలను బయటపెట్టారు. పాకిస్తాన్‌లో అమెరికాతో చర్చలు జరపడం వలన ఇరాన్‌ తన పట్టును కోల్పోయిందని, ఈ చర్చల సాకుతో అమెరికా అత్యంత కఠినమైన షరతులను ఇరాన్‌ ముందు ఉంచిందని పేర్కొన్నాడు. మొదటి నుంచి అమెరికా పట్టుబడుతున్నట్టుగానే ఇరాన్‌ వద్ద ఉన్న 60 శాతం శుద్ది చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. ఇదే ప్రధాన డిమాండ్‌. అంతేకాకుండా రాబోయే 20 ఏళ్ల వరకు ఇరాన్‌ ఎటువంటి అణుకార్యక్రమాలు చేపట్టకూడదని అమెరికా షరతులు విధించింది. ఈ షరతులను అంగీకరిస్తే ఇరాన్‌ ఉనికి కష్టమౌతుంది. అమెరికా విధించిన షరతులను తాము తిరస్కరించామని తెలిపారు. అయితే, ఈ చర్చల ద్వారా పురోగతి సంగతి ఎలా ఉన్నా అమెరికాకు కొంత పైచేయి సాధించిందన్నది వాస్తవం.

ట్రంప్ 'స్వేచ్ఛ'.. ఇరాన్ 'సంకెళ్లు'

రెండో విడత చర్చలు ఉంటాయని అనుకున్నా అనూహ్యంగా వాయిదా పడ్డాయి. అంతేకాకుండా సీజ్‌ఫైర్‌ను పొడిగించారు. ఈ పొడిగింపు ఎప్పటి వరకు అన్నది స్పష్టం చేయలేదు. కానీ, ఏప్రిల్‌ 23న ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. తనపై ఎవరి ఒత్తిడి లేదని, టైమ్‌ తనకు అనుకూలంగా ఉందని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ రక్షణ వ్యవస్థను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. గణాంకాలతో సహా ట్రంప్‌ వివరాలు వెల్లడించడంతో ఇరాన్‌ ఇరకాటంలో పడిపోయింది. ఇరాన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దాదాపుగా జలసమాధి అయిందని, రాడార్‌ వ్యవస్థలు పనికిరాకుండా పోయాయని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతోందని, మానసికంగా ఆ దేశం కుంగిపోయిందని అన్నారు. గాలికూడా ఆ దేశంలోకి చొరబడలేనంత గట్టిగా ఆంక్షలు విధించామని ట్రంప్‌ తెలిపారు.

అయితే, ఇరాన్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. తాము గతంలో కంటే బలంగా తయారయ్యామని చెబుతోంది. తమను ఏ శక్తి అడ్డుకోలేదని అంటోంది. ఇరాన్‌ సైన్యం ఒకలా, ఇరాన్‌ పార్లమెంట్‌ సభ్యులు మరోలా చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. ఇరాన్‌ అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసి, సైనిక శక్తి దేశాన్ని కంట్రోల్‌ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను కలిసేందుకు కూడా ఇరాన్‌ అధ్యక్షుడికి అవకాశం లేకుండా పోయినట్టు కథనాలు వస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా పెట్టే నిబంధనలకు ఇరాన్‌ తలవంచుతుందా? తన ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Tags:    

Similar News